కడుపున పెట్టుకునేటోళ్లా..రక్తం కండ్లజూసే వాళ్లా..?
కార్లతో తొక్కించి చంపేటోళ్లా? కాళేశ్వరం నీళ్లతో కాళ్లు కడిగేటోళ్లా?
ఎవర్ని గెలిపించాలో మీరే ఆలోచించండి..
మంత్రిగా ఈటల ఫెయిల్ అయ్యిండు.. ఇక్కడ అభివృద్ధి చెయ్యలె
అప్పుడు చేయకుండా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తడో చెప్పాలె?
పన్నులు వేసే బీజేపీకి గుణపాఠం చెప్పాలె.. పద్దులిచ్చే టీఆర్ఎస్ను గెలిపించాలె
ఉద్యమ బిడ్డ గెల్లు సీనుకు భారీ మెజార్టీ ఇయ్యాలె..
జమ్మికుంట మండలం కోరపల్లి రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు
జమ్మికుంట/జమ్మికుంట రూరల్, అక్టోబర్ 5 :“రైతుల మెడకు ఉరి బిగించినట్టు నల్లచట్టాలు తేవడమే గాక.. వారిపై కార్లు ఎక్కించి రక్తం కండ్లజూసే వాళ్లా? వంద తాటిచెట్ల లోతు నుంచి ఎత్తిపోసే కాళేశ్వరం నీళ్లతో అన్నదాత కాళ్లు కడిగే వాళ్లు కావాల్నా? బందూకులతో గురిపెట్టే పార్టీయా? రైతుబంధు, రైతుబీమాతో భరోసా ఇచ్చే పార్టీయా..? పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ కావాల్నా? పద్దులిచ్చే టీఆర్ఎస్ గెలువాల్నా?.. హుజూరాబాద్ ప్రజలారా..! తేల్చుకునే సమయమిదే.. ఎవరు కావాల్నో మీరే ఆలోచించండి. మంత్రిగా ఈటల ఫెయిల్ అయిండు. అప్పుడు అభివృద్ధి చేయకుండా ఇప్పుడు గెలిచి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏంజేస్తడు? ఈటల కంటే గెల్లు సీనే బెటర్. పేదోడు, ఉద్యమబిడ్డకు భారీ మెజార్టీ ఇవ్వండి.. రాజేందర్‌కు గుణపాఠం చెప్పండి.”
‘కేంద్రం నల్లచట్టాలు తెచ్చి ఇబ్బంది పెడుతోంది. రైతుల మీదకు కార్లెక్కిచ్చి చంపుతోంది.. మరి టీఆర్ఎస్ పార్టీ రైతులకు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటోంది. రైతులపైకి కార్లెక్కిచ్చి చంపే పార్టీ గెలవాల్నా..? కాపాడుకునే టీఆర్ఎస్ పార్టీ గెలవాల్నా..? ప్రజలే ఆలోచించాలె’ అని మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్ ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం జమ్మికుంట మండలం కోరపలిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి మంత్రి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలు, మంగళహారతులు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. పలు పార్టీల నుంచి గిరవేన శంకర్, ఆదర్శ్ ఆధ్వర్యంలో 200మంది యువకులు టీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ప్రజలనుద్దేశించి మంత్రి హరీశ్ మాట్లాడుతూ, ఏడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని.. ప్రజలపై పన్నులమీద పన్నులు వేస్తున్నదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం పద్దులు అందిస్తున్నదని తెలిపారు. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈటల ఎందుకు రాజీనామా చేసిండో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించాలనా? అభివృద్ధి చేయాలనా? అసలు ఎందుకు చేసిండో చెప్పాలన్నారు. ‘కేసీఆర్ 2001లో తెలంగాణ కోసం రాజీనామా చేసిండు.. ఉప ఎన్నిక వచ్చింది.. రాజీనామా చేసిన కేసీఆర్‌ను ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రాణాలొడ్డి స్వరాష్ర్టాన్ని సాధించారు. రాజీనామా అంటే ఇలా ఉండాలె కానీ, రాజకీయంగా వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించిన ఈటలలాగా కాదు’ అని దుయ్యబట్టారు. మంత్రులందరూ వాళ్ల నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తే.. ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇండ్ల నిర్మాణం బాధ్యత తాను తీసుకుంటానని, త్వరలో అందరికీ కట్టిస్తానని హామీ ఇచ్చారు. మంత్రిగా అభివృద్ధి చేయలేని ఈటల, రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తాడని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను దేవుడని కొలిచిన ఈటల, నేడు బొందపెట్టాలని ఎందుకంటున్నడో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పెంచిన ధరలు తగ్గించి ఓట్లు అడుగాలన్నారు.