మన పథకాలు దేశంలో ఎక్కడా లేవు..
గంగారంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
వీణవంక రూరల్,అక్టోబర్ 5: అన్ని వర్గాల ప్రజలను అడక్కుండానే ఆదుకోవడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. వీణవంక మండల పరిధిలోని గంగారం గ్రామంలో మంగళవారం గెల్లు శ్రీనివాస్ సతీమణి శ్వేతతో కలిసి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు అందిస్తూ, ప్రతి ఒక్కరినీ పలుకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు లేరన్నారు. దళితబంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కులవృత్తులకు అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. ఆయన పంపిన మీ బిడ్డ గెల్లు శ్రీనును ఆశీర్వదించి, అండగా నిలవాలని కోరారు. గెల్లు శ్రీను సతీమణి శ్వేత మాట్లాడుతూ పేదింటి బిడ్డను ఆశీర్వదించి గెలిపించాలన్నారు. మాకు వ్యాపారాలు, పెద్ద పెద్ద ఇండ్లు లేవని, మీ మధ్యలోనే ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గంగారం సర్పంచ్ పింగిళి కోమల్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, ఉపసర్పంచ్ సాయిరెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.