దళితబంధుకు కృతజ్ఞతగా టీఆర్ఎస్లో భారీగా చేరిక
కండువా కప్పి స్వాగతం పలికిన మంత్రి హరీశ్‌రావు
ఆయాచోట్ల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రాక
హుజూరాబాద్ రూరల్/జమ్మికుంట/వీణవంక/ ఇల్లందకుంట, సెప్టెంబర్ 5: దళితదండు కదిలింది.. దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా టీఆర్ఎస్కు జై కొట్టింది. ‘మీ వెంటే మేముంటాం’ అంటూ కోరుకున్నది. మరోవైపు ఎక్కడికక్కడ పార్టీలో సకలజనం వెల్లువలా చేరిపోతున్నది. ఆదివారం హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో చేరగా, గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ జోరు పెరిగింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సకలజనం గులాబీ పార్టీలో చేరుతుండగా, వారి వెంటే బీజేపీ, కాంగ్రెస్ క్యాడర్ అంతా తరలివస్తున్నది. ఆదివారం నియోజకవర్గంలో బీజేపీ నుంచి 2వేల మంది దళిత యువ నాయకులు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. జమ్మికుంట మండలం పెద్దంపల్లి, ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, గౌడ కులస్తులకు హరీశ్‌రావు కండువా కప్పి ఆహ్వానించగా, ఇల్లందకుంట మండలం బోగంపాడు, చిన్నకోమటిపల్లి, పాతర్లపల్లికి చెందిన మాజీ సర్పంచులు, పలువురు నాయకులకు ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి కండువాలు కప్పారు. ఇక వీణవంకలో కోర్కల్‌కు చెందిన యువకులు ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య సమక్షంలో పార్టీలో చేరారు.
చీడ పురుగులను తరిమికొట్టండి:మంత్రి హరీశ్‌రావు
దళితబంధుపై అసత్య ప్రచారాలు చేసే బీజేపీ చీడ పురుగులను తరిమికొట్టాలని మంత్రి హరీశ్‌రావు దళిత యువతకు పిలుపునిచ్చారు. ఆదివారం నియోజకవర్గంలోని బీజేపీకి చెందిన 2వేల మంది దళిత యువ నాయకులు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్లో టీఆర్ఎస్లో చేరారు. అలాగే హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ గెస్ట్‌హౌస్‌లో జమ్మికుంట మండలం పెద్దంపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన 100 మంది గౌడ కులస్తులు హుజూరాబాద్‌లోని సిటీ సెంట్రల్ హాల్లో పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దళితబంధు పథకాన్ని ఈటల అవహేళన చేశాడని, అసలు డబ్బులే రావని అవాకులు, చవాకులు పేల్చాడని విమర్శించారు. ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు ఖాతాలో జమవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్లో చేరిన దళిత యువత దళితబంధుపై ఇంటింటా తిరుగుతూ చైతన్యం కలిగించాలని కోరారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మీ ముందున్నాడని, మీ అన్నగా, తమ్మునిగా ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు.
అబద్ధాలను పటాపంచలు చేశాం: మంత్రి కొప్పుల ఈశ్వర్
బీజేపీ అబద్ధాలను పటాపంచలు చేశామని, దళితబంధు ప్రతి కుటుంబానికి అందించామని మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ ఏడేండ్లు మంత్రి పదవిలో ఉండి ఒక్క రో జు కూడా దళితుల అభివృద్ధి కోసం పాటు పడింది లేదని విమర్శించారు. కనీసం ఒక్క అంబేద్కర్ భవనాన్నీ నిర్మించిన పాపానపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితద్రోహి ఈటల: ఎమ్మెల్యే చందర్
దళిత ద్రోహి ఈటల రాజేందర్ అని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని దళిత యువతకు ఎమ్మెల్యే చందర్ విజ్ఞప్తి చేశారు. యువతకు స్ఫూర్తిదాత, సిద్ధిపేటను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన హరీశ్‌రావు బాటలో యువత నడవాలని కోరారు. స్వలాభం కోసం దళితుల ఆత్మగౌరవాన్ని ఈటల మంట గలిపాడని, ఆయన ఓటమి కోసం దళితులంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు.
వెన్నుదన్నుగా ఉండాలి: గెల్లు శ్రీనివాస్‌యాదవ్
74 ఏండ్లలో దళితుల బతుకులను ఏ రాజకీయ పార్టీ కూడా మార్చలేదని, కేవలం ఏడేండ్లలో సీఎం కేసీఆర్ దళితబంధు అందించి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నాడు. దళితబంధు అందించిన ప్రభుత్వానికి దళితులు కృతజ్ఞతతో వెన్నుదన్నుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా నాకు అవకాశం కల్పించి గెలిపించాలని, మీ వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తానని తెలిపారు.
డిపాజిట్ కోసమే ఈటల కొట్లాట: పాడి కౌశిక్‌రెడ్డి
ఉప ఎన్నికలో గెల్లు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, డిపాజిట్ కోసమే ఈటల రాజేందర్ కోట్లాట అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హరీశ్‌రావును విమర్శించే స్థాయి ఈటలకు లేదని, దమ్ము, ధైర్యం ఉంటే ఇల్లందకుంట రాములోరి సాక్షిగా అభివృద్ధిపై చర్చకు రామ్మని సవాల్ విసిరారు. ఇప్పటికే పలుసార్లు చర్చకు రమ్మని పిలిచినా, ఈటల స్పందించడం లేదని, ఆయనొక అవినీతి పరుడని ఆరోపించారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు టంగుటూరి రాజుకుమార్, పార్టీలో చేరిన నియోజకవర్గ దళిత యువ నాయకులు రాజేశ్, విక్రం, బానుచందర్, అఖిల్, వంశీకృష్ణ, రాజుకుమార్, సంతోష్, కుమార్, కిరణ్, సుకుమార్, మధు, కళ్యాణ్, కరణ్, రాజు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే గ్రామాలాభివృద్ధి:ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
కొట్లాడి సాధించిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, టీఆర్ఎస్తోనే గ్రామాలభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇల్లందకుంట మండలం బోగంపాడు, చిన్నకోమటిపల్లి, పాతర్లపల్లికి చెందిన మాజీ సర్పంచులు, పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సుడా చైర్మన్ రామకృష్ణారావుతో కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో బోగంపాడు మాజీ సర్పంచ్ మూల సాంబమూర్తి, చిన్నకోమటిపల్లి మాజీ సర్పంచ్ మూడెడ్ల కుమారస్వామి, నాయకులు చుక్క చందు, బైరెడ్డి నారాయణరెడ్డి, ఓదేలు, కృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, అభిలాష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, విజేందర్ ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమానికి చిరునామా తెలంగాణ:ఎమ్మెల్యే వెంకట వీరయ్య
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలతో దేశంలో సంక్షేమానికే చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉద్ఘాటించారు. వీణవంక మండల కేంద్రంలో ఆదివారం కోర్కల్‌కు చెందిన 40 మంది యువకులు, రజకులు బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరగా, పార్టీలోకి ఆహ్వానించి, మాట్లాడారు. ఇక్కడ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, మాజీ జడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, కనపర్తి పర్లపెల్లి రమేశ్, నాయకులు మర్రి స్వామి, సంగ సమ్మయ్య, అంబాల కిరణ్, సదానందం, తదితరులు పాల్గొన్నారు.
ఈటల నీచ రాజకీయాలు చేస్తండు..
ఈటల నీచ రాజకీయాలు చేస్తండు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై అబద్ధపు మాటలు చెప్తున్నడు. మాలాంటి యువతను తప్పుదోవ పట్టిస్తండు. గడియారాలు, గొడుగులు ఇచ్చి పంచమని చెప్పిండు. దళితబంధుపై అసత్య ప్రచారాలు చేయమని వాడుకున్నడు. దళితబంధు పైసలు ఇప్పుడు అందరి ఖాతాల్లో పడ్డయ్. మేం కండ్లు తెరిచినం. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ఉంటాం. బంగారు తెలంగాణలో భాగస్వాములవుతం. ఈటలకు డిపాజిట్ రాకుండా ఓడిస్తం.