ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు బిజీ..బిజీ
ఉదయం నుంచి సాయంత్రం దాకా పర్యటనలు
గెల్లును గెలిపించేందుకు నిర్విరామ కృషి
కార్యకర్తలకు దిశానిర్దేశం
హుజూరాబాద్, సెప్టెంబర్ 5: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఓటర్లకు సందేశమిస్తూ ముందుకుసాగుతున్నారు. ప్రతిరోజూ 14 గంటలపైగా పనిచేస్తూ గెల్లు గెలుపును భుజస్కందాలపై వేసుకున్నారు. తనదైన శైలీలో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు. ఓ వైపు బీజేపీ నేత ఈటల డొల్ల తనాన్ని బయట పెడుతూ, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. చెణుకులు విసురుతూ. పిట్ట కథలు చెబుతూ ప్రతిపక్ష పార్టీల బండారాన్ని ఎండగడుతున్నారు. ఇతర మంత్రుల నియోజకవర్గాల్లో చేపట్టిన పనులు.. ఇక్కడ ఎందుకు చేయలేదని బీజేపీ నేతను కడిగిపారేస్తున్నారు.
ఉదయం సమాలోచనలు.. మధ్యాహ్నం సమావేశాలు
శనివారం రాత్రి కార్యక్రమాలు ముగించుకొని మండలంలోని సింగాపూర్ కిట్స్ కళాశాల గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. అక్కడ పొద్దుపోయే దాకా నాయకులు, కార్యకర్తలతో సమాలోచనలు చేశారు. ఆదివారం పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా ఉండడంతో వేకువజామున్నే లేచారు. ఉదయం 7గంటలకు జమ్మికుంట మండలం పెద్దంపల్లికి చెందిన బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉదయం 8:30 గంటలకు సిటీసెంటర్హాల్లో రెడ్డి సంఘం బాధ్యులతో చర్చలు జరిపారు. తర్వాత సింగాపూర్‌కు చేరుకొని అల్పహారం తీసుకుంటూ అక్కడ కాసేపు టీఆర్ఎస్ ముఖ్యనేతలతో ముచ్చటించారు. 12గంటలకు సాయిరూపాగార్డెన్స్లో గురుపూజోత్సవం సందర్భంగా ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రైవేట్ టీచర్ల సన్మానోత్సవానికి హాజరయ్యారు. వంద మందికి పైగా ప్రైవేట్ టీచర్లను స్వయంగా సన్మానించారు. తన వెంట వచ్చిన మంత్రి గంగుల కమలాకర్‌కు మిగతావాళ్లను సన్మానించాలని సూచించి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 1గంటకు సిటీసెంటర్హాల్లో పంచాయతీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన వంద మంది గౌడ కులస్తులు టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి సమక్షంలో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. సిటిసెంటర్హాల్లో లంచ్ ముగించుకొని 3గంటలకు జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్‌లో బీజేపీకి చెందిన దళిత యువకులు టీఆర్ఎస్లో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఆర్బీస్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ రెండు కార్యక్రమాల్లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. సాయంత్రం 6గంటలకు జమ్మికుంటలోని బిజిగిరిషరీఫ్ దర్గాను హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి దర్శించుకొని ప్రార్థనలు చేశారు. 8గంటలకు ఎంపీఆర్ గార్డెన్స్‌లో జరిగిన ముస్లిం నేతల చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి 10గంటలకు ఈ కార్యక్రమం పూర్తి కాగా, బస చేసేందుకు 10.30గంటలు సింగాపూర్‌కు చేరుకున్నారు. అప్పటికే మంత్రి కోసం ఎదురు చూస్తున్న నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. రాత్రి 12 గంటల తర్వాత నిద్రకు ఉపక్రమించారు.