దళిత వాడలకొస్తే ఈటలను అడ్డుకుంటాం
ఎమ్మార్పీఎస్ టీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ
హుజూరాబాద్, సెప్టెంబర్ 5: బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో ఆ పార్టీ నేత ఈటల ఒక కారణం చెబితే చాలని.. కానీ టీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలో తాను వంద కారణాలు చెబుతానని ఎమ్మార్పీఎస్ టీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితులను చదువుకు దూరం చేసింది బీజేపీ అని, అలాంటి పార్టీలో చేరిన ఈటల రాజేందర్‌కు దళితుల ఓటడిగే హక్కు లేదన్నారు. మనువాద పార్టీలో చేరిన ఆయనను ఉప ఎన్నికలో వ్యతిరేకించాలని దళిత, బహుజనులను కోరారు. దళిత వాడలకు ఓట్ల కోసం వస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని బీజేపీ కాలరాస్తూ మనువాద సిద్ధాంతాన్ని తీసుకువచ్చే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు లేకుండా కుట్రలు పన్నుతున్నదని, ఈ మేరకు విశ్వవిద్యాలయాలకు లేఖలు రాసిందని తెలిపారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే రాజీవ్‌గాంధీ ఫెలోషిప్ తీసేసిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహ్మదీయుల ఆస్తులను జప్తు చేస్తామని బండి సంజయ్ తన పాదయాత్రలో అంటున్నారని, దీన్నిబట్టి మైనార్టీల ఆస్తులను గుంజుకోవడమే ఆ పార్టీ లక్ష్యమా? అని ప్రశ్నించారు. ‘రానున్న వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరాం అనాల్సిందేనా?, లేకుంటే ముస్లింలపై దాడి చేస్తావా..?’ అని ప్రశ్నించారు. వీటన్నింటిపై సమాధానం చెప్పకుండా దళితులను ఓట్లడిగే అర్హత ఈటలకు లేదన్నారు. ఓట్లు అడగాలంటే బీజేపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తునికి వసంత్మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్కపెల్లి కుమార్, ఆయా జిల్లాల అధ్యక్షులు కోడెపాక సారంగం, ఇల్లందుల రాజేశ్‌కన్నా, నాయకులు పాల్గొన్నారు.