రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
జమ్మికుంట, సెప్టెంబర్ 5 : సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాదని, ఆయన మతసామరస్యతను కాపాడుతున్నాడని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో ఆదివారం రాత్రి జరిగిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఆయనతో పాటు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు చెందిన వారంతా ప్రశాంతంగా జీవిస్తున్నారని, ముస్లింలకు పూర్తి భద్రత ఇక్కడే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో హరీశ్‌రావు, ఈశ్వర్, గెల్లు శ్రీను, ఇలా ఎందరో కీలకపాత్ర పోషించారని, హరీశ్‌రావుకు సీఎం ఏ పని అప్పగించినా వందశాతం ఫలితాన్ని అందిస్తాడని తెలిపారు. సీఎం కేసీఆర్ ముస్లిం నుంచి తనను హోంమంత్రిగా చేసిండని, ముస్లింలు కోరుకునే శాంతిభద్రతలు టీఆర్ఎస్ సర్కారుతోనే సాధ్యమన్నారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం షాదీ ముబారక్, ముస్లిం పెద్దలకు వేతనాలు, మసీదులు, ఖబ్రస్థాన్‌లకు నిధులు అందిస్తున్న వివరాలు తెలిపారు.
కోకాపేటలో ముస్లిం కన్వెన్షన్ సెంటర్‌కు రూ.10 కోట్లు, 10 ఎకరాల భూమిని ఇచ్చిన మహానాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఢిల్లీ పార్టీ బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమన్నారు. బీజేపీకి ఓటెయ్యద్దని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లిం నాయకులకు పదవులు ఇవ్వలేదని ఆరోపించారు. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్‌కే ఓటేయాలని కోరారు. 204 గురుకులాలను ఏర్పాటు చేసి ముస్లింలకు ఉచిత విద్యనందిస్తున్న సీఎం కేసీఆర్, ముస్లింల పక్షపాతని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జమ్మికుంట, హుజూరాబాద్‌లలో షాదీఖానా, ఖబ్రస్థాన్లను నిర్మించేందుక నిధులు, స్థలం అందిస్తామని హామీ ఇచ్చారు. బిజిగిరి దర్గాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింల పెండింగ్ లోన్స్ అన్నీ క్లియర్ చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులు రాజేశ్వర్‌రావు, రాజ్‌కుమార్, మల్లయ్య, సమ్మిరెడ్డి, జాకీర్, పాషా, జమీర్, హుస్సేన్, ముజాహిద్ హుస్సేన్, నయూం, జమీల్, తదితరులు పాల్గొన్నారు.
బిజిగిరి షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థన
మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్‌కుమార్, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.