ఈ నెల నుంచే 30 శాతం పెంపు అమలు
హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కార్పొరేషన్, జనవరి 5: కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతన పెంపును అమలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులకు 30 శాతం వేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆయా మున్సిపాలిటీలు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వేతన పెంపును అమలు చేస్తున్నాయి. కాగా, నగర మేయర్ వై సునీల్‌రావు కార్మికుల వేతనాల పెంపు విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయంలో నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించి డిసెంబర్ నుంచి కార్మికుల వేతనాలు పెంచాలని గత నెలలో నిర్ణయించారు. ఈ మేరకు పెంచిన వేతనాలను బుధవారం కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 12 వేల వేతనం వస్తుండగా, 30 శాతం పెంపుతో రూ. 15,600 వస్తాయి. దీంతో నగరపాలక సంస్థలో పని చేస్తున్న సుమారు 900 మంది కార్మికులు లబ్ధి చేకూరుతుంది. పెరిగిన వేతనాలతో నగరపాలక సంస్థపై ప్రతి నెలా రూ.35 లక్షల మేరకు ఆర్థిక భారం పడుతుంది. అయినా కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచినట్లు మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. కాగా, పారిశుధ్య కార్మికులు వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మేయర్ వై సునీల్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌దే
పట్టణాలు, నగరాల పరిశుభ్రత కోసం పాటుపడుతున్న పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ అండగా ఉంటున్నది. కరోనా సమయంలో బోనస్‌తో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. వేతనాల పెంపు జీవోను అమలు చేసిన మేయర్ వై సునీల్‌రావుకు కార్మికులు రుణపడి ఉంటారు. –ఎల్ రూప్సింగ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుడు