మానకొండూర్ రూరల్, జనవరి 5: లక్ష్మీపూర్ (వెల్ది) పీహెచ్సీ పరిధిలో డాక్టర్ బియాబాని ఆధ్వర్యంలో బుధవారం 70 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. లక్ష్మీపూర్, వెల్ది, దేవంపల్లి, లింగాపూర్, ఊటూర్, కేల్లేడు, మద్దికుంట గ్రామాలతో పాటు దేవంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులను కలుపుకొని 311 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇక్కడ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్వైజర్లు అన్నపూర్ణ, ఎండీ జుబేర్, ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్ ఎండీ ఇజాజ్, సిబ్బంది ఉన్నారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడి, జనవరి 5: అర్హులైన చిన్నారులు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సాజిదా సూచించారు. మండలంలోని చిగురుమామిడి, బొమ్మనపల్లి, సుందరగిరి, ములనూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల, కస్తూర్బా, మోడల్ సూల్ విద్యార్థులకు వైద్య సిబ్బంది బుధవారం టీకాలు వేశారు. మండల వైద్యాధికారి నాగశేఖర్తో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. 15 నుంచి 18 ఏండ్ల లోపు విద్యార్థులు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒకరూ మాసులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల విద్యార్థులకు టీకా వేస్తారని చెప్పారు. ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఇక్కడ ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
తిమ్మాపూర్‌లో..
తిమ్మాపూర్ రూరల్, జనవరి 5: మండలంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 15 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది బుధవారం టీకాలు వేశారు. విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఒమిక్రాన్ ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో 15 సంవత్సరాల పైబడిన వారందరూ టీకాలు వేసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. మన్నెంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని సర్పంచ్ మేడి అంజయ్య పర్యవేక్షించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.