సీఎండీ శ్రీధర్
అన్ని ఏరియాల జీఎంలతో సమీక్ష
సీసీసీ నస్పూర్/మందమర్రి రూరల్, జనవరి 5 : భూగర్భ, ఓసీపీ గనుల్లో భారీ యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ వార్షిక లక్ష్యం అధిగమించాలని జీఎంలకు సీఎండీ శ్రీధర్ సూచించారు. హైదరాబాద్ నుంచి డైరెక్టర్లు బలరాం, చంద్రశేఖర్‌తో కలిసి అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత్తి, బొగ్గు రవాణా, భారీ యంత్రాల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ఉత్పత్తికి వినియోగిస్తున్న భారీ యంత్రాలు ఎక్కువ గంటలు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా లక్ష్యాలను అధిగమించేలా తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. వార్షిక లక్ష్యానికి ఇంకా మూడు నెలలే ఉందని తెలిపారు. కలిసికట్టుగా పనిచేసి ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను రక్షణతో సాధించుకోవాలని సూచించారు. యంత్రాల పనితీరు, సామర్థ్యం పెంచేందుకు ప్రణాళికలు, యం త్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి, తదితర అంశాలపై శ్రీరాంపూర్ జీఎం సురేశ్‌కు దిశా నిర్దేశం చేశారు. శ్రీరాంపూర్, ఇందారం ఓసీపీల ఓబీ లక్ష్యాలపై ఆరాతీశారు. ఓబీ వెలికితీత పనులను వేగవంతం చేయాలని సూచించారు. మందమర్రి కేకే, ఆర్కేపీ ఓసీ కాంట్రాక్టులు నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునేందుకు తీసుకుంటున్న చర్యల గురించి జీఎం చింతల శ్రీనివాస్‌ను సీఎండీ అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగు లు కలిసికట్టుగా పని చేసినప్పుడే ఉత్పత్తి సా ధ్యమవుతుందని పేర్కొన్నారు. సమావేశం లో శ్రీరాంపూర్ నుంచి ఎస్వోటూజీఎం గుప్తా, ఏరియా ఇంజినీర్ శ్రీకుమార్, ఓసీపీ పీవోలు పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, సీహెచ్ పీ డీజీఎం డీవీ రావు, ఐఈడీ డీజీఎం చిరంజీవులు, ఎస్టేట్స్ ఆఫీసర్ శ్రీనివాస్.., మందమర్రి ఏరియా నుంచి ఎస్వోటూ జీఎం గోపాల్ సింగ్, ఏజీఎం (ఈఆండ్ఎం) రామ్మూర్తి, క్వాలిటీ రామ్మోహన్, డీజీఎం ఐఈడీ రాజన్న, డీజీఎం (ఈఅండ్ఎం) బా లాజీ భగవతి.., ఆర్జీ-3 నుంచి జీఎం మనోహర్, ఇంజినీర్ ఎలీషా, పీవో రాధాకృష్ణ, నరేందర్, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.