చొప్పదండి, డిసెంబర్ 4: చొప్పదండి బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగిన ఫుడ్‌పాయిజన్ ఘటనపై జిల్లా బాలల సంక్షేమ సమితి, చైల్డ్‌లైన్ 1098 సభ్యులు శనివారం విచారణ చేపట్టారు. ఆహారం వికటించి అస్వస్థతకు గురైన ఘటన గురించి బాలల సంక్షేమసమితి చైర్పర్సన్ ధనలక్ష్మి, సభ్యులు రేండ్ల కళింగ శేఖర్, రాధ, జిల్లా చైల్డ్‌లైన్ 1098 కో ఆర్డినేటర్ సంపత్ శనివారం పాఠశాలను సందర్శించారు. అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలు తెలుసుకుని విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థులకు పెడుతున్న అన్నం, కూరలను పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి జిల్లా వైద్యాధికారి జువేరియాను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థినులతో మాట్లాడి వారు పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి పేపర్లద్వారా తెలుసుకున్నారు. వారి వెంట ఐసీపీఎస్ సోషల్ వర్కర్ రమేశ్, డాటా ఎంట్రీ ఆపరేటర్ క్రాంతికిశోర్ తదితరులు ఉన్నారు.
పాఠశాలను సందర్శించిన ఫుడ్‌ఇన్‌స్పెక్టర్
గురుకుల పాఠశాలను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష సందర్శించారు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలో అమలు చేస్తున్న భోజనం మెనూను తెలుసుకున్నా రు. వంటగదిలో సామగ్రిని పరిశీలించారు. విద్యార్థినులకు వడ్డించే భోజనం షాంపిల్స్‌ను సేకరించారు. ఆమె వెంట తహసీల్దార్ రజిత, ఎస్ఐ వంశీకృష్ణ తదితరులున్నారు.
ఇంటిదారి పట్టిన విద్యార్థినులు
గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థినులు ఇంటిబాట పట్టారు. ఫుడ్‌పాయిజన్ జరిగిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని తమ పిల్లల ఆరోగ్యపరిస్థితిని గురించి తెలుసుకున్నారు. భయాందోళనకు గురైనవారిని పలువురు తల్లిదండ్రులు ప్రత్యేక అనుమతి రెండురోజుల పాటు ఇంటికి తీసుకెళ్లారు.