కార్పొరేషన్, డిసెంబర్ 4: భారత పౌరులుగా అవినీతి నిర్మూలనకు కృషి చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు పేర్కొన్నారు. ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు జరిగే అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట శనివారం అధికారులు, ఉద్యోగులు అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా అధికారులు, ఉద్యోగులు మాట్లాడుతూ, భారత దేశ పౌరులుగా అవినీతిని ప్రోత్సహించబోమని, అవినీతికి పాల్పడబోమని పేర్కొన్నారు. భారత దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, నగరపాలక సంస్థను అవినీతి రహితంగా తీర్చిదిద్దడానికి తమవంతు కృషి చేస్తామని ప్రమాణం చేశారు. అవినీతిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు కట్టుబడి ఉంటామని, విధుల్లో క్రమశిక్షణతో మెదులుతూ ప్రజలకు జవాబుదారీగా సేవలందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఈ రామన్, డీఈలు ఓం ప్రకాశ్, వెంకటేశ్వర్, ఆర్వో ఆంజనేయులు, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రాంనగర్, డిసెంబర్ 4: అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మద్య నిషేధ, ఆబారీ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారత్‌ను అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడానికి తమవంతు కృషి చేస్తామని కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట ఎక్సైజ్ స్టేషన్లలో సీఐలు, ఎస్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది, కానిస్టేబుళ్లు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పీ తాతాజీ, సీఐలు ఇంద్రప్రసాద్, దుర్గాభవానీ, అక్బర్ హుస్సేన్, ఎస్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. అలాగే, కొత్తపల్లి తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.