చొప్పదండి, డిసెంబర్ 4: ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులను కంటికిరెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. చొప్పదండి గురుకుల పాఠశాలను శనివారం ఆయన సందర్శించి, శుక్రవారం ఆహారం వికటించిన ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినులతో మాట్లాడి, పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, శుక్రవారం పెట్టిన భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు ఏ నీళ్లతో స్నానం చేస్తున్నారని ప్రిన్సిపాల్ స్వాతిని ఎమ్మెల్యే ప్రశ్నించగా, చన్నీళ్ల స్నానం చేస్తున్నారని చెప్పారు. వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి పాఠశాలలో సోలార్ హీటర్ ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. పాఠశాలలో ఉడికీ, ఉడకని అన్నం పెడుతున్నారని, కూరల్లో నాణ్యతా పాటించడం లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు విన్నవించగా, వంటగదికి వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం పెట్టాలని నిర్వాహకులను ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి జువేరియాకు ఫోన్ చేసి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయగా అందరూ కోలుకుంటున్నారని తెలిపారు. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని బాలికల గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులకు ఐరన్, విటమిన్ బీ, సీ మాత్రలు ఇవ్వాలని వైద్యాధికారికి సూచించారు. పాఠశాలలో ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే తనకు సమాచారం అందించాలని, తన ఫోన్ నంబరు పాఠశాల నోటీస్ బోర్డుపై ఉంచాలని ప్రిన్సిపాల్ స్వాతికి సూచించారు. పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుండడంతో అరకొర వసతులతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని, సొంత భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. పాఠశాలకు స్థలం కేటాయించాలని తహసీల్దార్ రజితను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, అస్వస్థతకు గురైన ప్రతి విద్యార్థినికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట సీఐ నాగేశ్వర్రావు, ఎస్ఐ వంశీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, మాచర్ల వినయ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మచ్చ రమేశ్, పాషా, మావురం మహేశ్, గంకిడి వెంకటరమణారెడ్డి, బీసవేని రాజశేఖర్ తదితరులు ఉన్నారు.