హుజూరాబాద్‌టౌన్, డిసెంబర్ 4: దళిత బంధు పథకం ద్వారా ట్రాన్స్‌ఫోర్ట్ హార్వెస్టర్, టాక్టర్ పథకాలకు ఎంపికైన నియోజకవర్గంలోని లబ్ధిదారులకు హుజూరాబాద్ పట్టణంలో మూడు రోజులుగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. మొత్తం 6,800 మంది లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చారు. లబ్ధిదారులకు లైసెన్సులు ఉన్నాయా… లేవా అని అడిగి తెలుసుకున్నారు. 20 శాతం మందికి గతంలోనే లైసెన్స్‌లు ఉన్నట్లు అధికారులు ఈ సందర్భంగా గుర్తించామన్నారు. లేనివారికి రోజుకు 200 నుంచి 240 మంది చొప్పున స్లాట్ బుక్ చేసి వాహనాలు నడపరాని లబ్ధిదారులకు 30 రోజుల పాటు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి లైసెన్స్ ఇస్తామని తెలిపారు. లబ్ధిదారులు వాహనాలు కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు మారేలా అవగాహన కల్పించామన్నారు. వేరే పథకాలకు మార్చుకునేందుకు 15 స్టాల్స్ ఏర్పాటు చేసి పథకాల మార్పునకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఈ పథకాలను లబ్ధిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయ అధికారులు మసూద్ అలీ, కనకయ్య, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఉద్యోగులు, హుజూరాబాద్ ఎంవీఐ సిరాజ్ ఉర్ రహమాన్ పాల్గొన్నారు.