జమ్మికుంటలో కాలు పెట్టగానే కరెంటు పోయింది
విద్యుత్ అధికారులేం చేస్తరు.. టీఆర్ఎస్ పార్టే ఏం చేస్తది
సభ నడిపించుకోవాలంటే హాల్ యజమానిల కరెంటు బిల్లు కట్టాలేగదా..?
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే.. తగిన మూల్యం చెల్లిస్తరు
విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు హెచ్చరిక
జమ్మికుంట, అక్టోబర్ 4 : బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత బీజేపీ పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నదని, జమ్మికుంటకు రాకరాక మీటింగ్‌కు వచ్చిన సభలో కరెంటే లేకుండా పోయిందని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు ఎద్దేవా చేశారు. బీజేపీ సభ పెట్టుకున్న ఫంక్షన్ హాల్ విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటు సరఫరాను అధికారులు నిలిపివేశారని, జనరేటర్లో డీజిల్ పోసుకోలేక టీఆర్ఎస్ పార్టీ, అధికారులపై ఇష్టానుసారం మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. బండి, ఈటల ఇద్దరూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తగిన మూల్యం చెల్లించే రోజులు ఎంతో దూరంలో లేదని అన్నారు. సోమవారం చైర్మన్, ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫంక్షన్ హాల్ యజమాని విద్యుత్ చార్జీ రూ.60వేలకు చెల్లించాల్సి ఉందని, అందుకే అధికారులు సరఫరాను నిలిపివేశారని తెలిపారు. విద్యుత్‌ను అధికారులు నిలిపివేస్తే టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని? ప్రశ్నించారు. ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, నోరు ఉంది కదా అని, ఎలాబడితే అలా మాట్లాడటం సభ్యతకాదన్నారు. ఓటమి భయంతో ఏం మాట్లాడుతున్నారో? తెలియకుండా ఉన్నారని పేర్కొన్నారు. ఈటల ప్రజాబలాన్ని కోల్పోయారని ఆరోపించారు. తప్పుడు మాటలకు తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 24గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. ఒక్క క్షణం కూడా కరెంట్ కట్టింగ్లు లేకండా సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రవేశపెట్టిన దళిత బంధుపై అసత్య ప్రచారాలు చేశాడని, దళిత బంధు ఇప్పుడు అందరి ఖాతాల్లో జమ అయ్యాయి కదా.. ఈటల ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో? చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదని, అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజల ఉసురు తగిలి పోతావని శాపనార్థాలు పెట్టారు. నియంతలా వ్యవహరించిన నీకు ప్రజలు క్షమించరని, ఓటు వేయరని తెలిపారు. టీఆర్ఎస్ వైపే ప్రజలంతా ఉన్నారని తెలిపారు. గెల్లు సీనునే గెలిపిస్తారని పేర్కొన్నారు.