చొప్పదండి గురుకులంలో ఆహారం వికటించి 100 మంది పిల్లలకు వాంతులు
మంత్రి, కలెక్టర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి వైద్య సిబ్బంది
పాఠశాలలోనే పిల్లలకు వైద్యం
పలువురికి కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స
తప్పిన ప్రమాదం.. నిలకడగా ఆరోగ్యం
చొప్పదండి/ కార్పొరేషన్/ విద్యానగర్, డిసెంబర్ 3: చొప్పదండి బాలికల గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, అధికార, వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. హుటాహుటిన పిల్లలకు వైద్యం చేయించడంతోపాటు పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి కరీంనగర్ దవాఖానకు తరలించి చికిత్స అందించింది. వివరాల్లోకి వెళితే.. పాఠశాలలో 470 మంది విద్యార్థినులకు గానూ 450 మంది శుక్రవారం పప్పు, క్యాబేజీ, సాంబారు, కోడిగుడ్లతో మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పిల్లలు కడుపునొప్పి అంటూ వాంతులు చేసుకున్నారు. ఒక్కొక్కరిగా దాదాపు 100 మంది అస్వస్థతకు గురవగా, అందులో పరిస్థితి తీవ్రంగా ఉన్న 47 మందిని కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. మిగతా విద్యార్థినులకు తహసీల్దార్ రజిత పాఠశాలలోనే స్థానిక వైద్యసిబ్బందితో చికిత్స అందించారు. విద్యార్థుల పరిస్థితి గురించి తహసీల్దార్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, డీఎంహెచ్‌వో జువేరియా పాఠశాలకు వచ్చి చికిత్సను పర్యవేక్షించారు. విద్యార్థినులతో మాట్లాడారు. కరీంనగర్ దవాఖానకు వెళ్లి పరిశీలించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. అయితే అస్వస్థతకు గురైన సమయంలో చొప్పదండి పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై తహసీల్దార్ రజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆహారం వికటించడానికి కారణమైన మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్య తీసుకోవాలని ఎంపీపీ చిలుక రవీందర్ కోరారు.
భయపడాల్సిందేమీ లేదు : మంత్రి గంగుల
విద్యార్థినులందరూ కోలుకుంటున్నారని, భయపడాల్సింది ఏమీ లేదని తల్లిదండ్రులకు మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. ఫుడ్ పాయిజన్ ఘటన సమాచారం తెలియగానే వెంటనే కలెక్టర్ కర్ణన్‌తో ఫోన్లో మాట్లాడారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ ద్వారా పూర్తి వివరాలు సేకరించిన మంత్రి, మధ్యాహ్న భోజనంలో క్యాబేజీ కూర వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని తెలుసుకున్నారు. కాగా, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శ
కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థినులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. విషయం తెలియగానే ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపు నుంచి నేరుగా దవాఖానకు వచ్చారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని విద్యార్థినులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ఆర్ఎంవో చంద్రశేఖర్‌తో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.