శాపంలా బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కరువు
కోట్లలో పెట్టుబడి పెట్టిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు
90కి పైగా కొత్త మిల్లుల పరిస్థితి అగమ్యగోచరం
బావురుమంటున్న మిల్లర్లు
కేంద్రం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాలని విజ్ఞప్తి
కరీంనగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రం నిర్ణయాలు..మిల్లర్ల పాలిట శాపంలా మారుతున్నాయి. రైస్ ఇండస్ట్రీకి కేరాఫ్‌గా మారిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఏర్పాటు చేసిన మిల్లుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయి. అన్నదాతలు పండించిన పంటలను కొనుగోలు చేసి, మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని తెలిసినా.. ఆ మేరకు స్పందించకపోవడం, వచ్చే యాసంగి నుంచి అసలు బియ్యం సేకరించే ప్రశ్నేలేదన్నట్లుగా వ్యవహరిస్తుండడం.. అయోమయంలో పడేస్తున్నది. స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, ఉచిత కరెంట్ ఇస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న ధాన్యం రాబడిని దృష్టిలో పెట్టుకొని.. కొత్తగా 90కిపైగా మిల్లులను నెలకొల్పుతున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వచ్చే యాసంగిలో వడ్లు కొంటారా..? లేదా..? అన్న ఒకే ఒక ప్రశ్నకు కేంద్రం చెప్పే సమాధానంపైనే రైస్‌మిల్లుల భవిష్యత్ ఆధారపడి ఉన్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైస్ ఇండస్ట్రీకి కేరాఫ్. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు మించిన పంట ఇక్కడ పండుతున్నది. అంతేకాదు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి, గోదావరి జలాలను నలుమూలలకూ పారించారు. ఉచిత కరెంట్, రైతుబంధు కూడా ఇచ్చారు. ఫలితంగా నాలుగు జిల్లాల్లోని రైతులు వ్యవసాయంవైపు మళ్లారు. సుమారు 3 లక్షలకుపైగా రైతులు వరిసాగు చేస్తున్నారు. మంచి పంటలు పండిస్తూ.. నాణ్యమైన దిగుబడులు తీస్తున్నారు.
తాజా నిబంధనలే శాపం..
కేంద్రం తాజాగా పెడుతున్న నిబంధనలు మిల్లర్ల పాలిట శాపంలా మారాయి. పండించిన పంటలను కొనుగోలు చేసి మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని తెలిసినా.. ఆ మేరకు కేంద్ర సర్కారు పనిచేయకపోవడం.. వచ్చే యాసంగి నుంచి బియ్యం సేకరించే ప్రశ్నేలేదన్నట్లుగా వ్యవహరించడం మిల్లుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. ఇటు రైతులు, అటు మిల్లర్ల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని.. గత ఐదు రోజుల నుంచి పార్లమెంట్ సాక్షిగా టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా ఇప్పటివరకు స్పష్టతనివ్వడం లేదు. వచ్చే యాసంగిలో వండ్లు కొంటారా..? లేదా..? కొంటే ఎంత మొత్తం కొంటారో చెప్పాలన్న ఒకే ఒక ప్రశ్నకు కేంద్రం నుంచి సమాధానం లేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది. ఇప్పుడు కేంద్రం చెప్పే సమాధానంపైనే రైస్‌మిల్లుల భవిష్యత్ ఆధారపడి ఉన్నది.
మిల్లుల విస్తరణ..
వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఆ కారణంగా ఉమ్మడిజిల్లాలో ఏయేటికాయేడు వరి సాగుతోపాటే ధాన్యం దిగుబడి భారీగా పెరుగుతూ వస్తున్నది. ఇలా పెరుగుతుండడంతో మిల్లర్లు తమ రైస్‌మిల్లులను అప్డేట్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఇస్తున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి అవసరమైన సామర్థ్య పెంపునకు ఆధునిక యంత్రాలను సమకూర్చుకున్నారు. మిల్లింగ్ చేయడం తమదే బాధ్యత అనే మంచి లక్ష్యంతో కోట్లాది రూపాయలు వెచ్చించి.. పాత మిల్లులను ఏడాది కాలంగా ఆధునీకరిస్తూ వస్తున్నారు. దీంతోపాటు పెరుగుతున్న ధాన్యం దిగుబడులు, వరిసాగుపై రైతులు చూపుతున్న ఆసక్తి, పుష్కలమైన సాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్, ఇబ్బందులు లేకుండా రైతు పెట్టుబడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న వివిధ రంగాలకు చెందిన యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు.. ఏడాది కాలంలో 90కిపైగా కొత్త పారాబాయిల్డ్ మిల్లులు నిర్మిస్తున్నారు. అందులో ఇప్పటికే కొన్ని పూర్తికాగా.. మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. కొత్త మిల్లులన్నింటికీ అధునాతన టెక్నాలజీ వాడుతున్నారు. ఫలితంగా ఒక్కో మిల్లు నిర్మాణానికి భూమితో కలుపుకొని 10 కోట్ల నుంచి 12 కోట్లదాకా ఖర్చు అవుతున్నది. ఇప్పటికే చాలామంది ఔత్సాహికు లు భారీ వ్యయం చేశారు.
రెండు లక్షల కుటుంబాలపై ప్రభావం..
బాయిల్డ్ మిల్లుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారితే.. వీటిపై ఆధారపడిన సుమారు రెండు లక్షల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదమున్నది. మిల్లులో పనిచేసే సిబ్బంది, హమాలీలు, గోదాముల్లో పనిచేసే కార్మికులు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వాహనాలు, వాటిపై పనిచేసే సిబ్బంది, మార్కెటింగ్ సిబ్బంది ఇలా విభిన్న విభాగాలకు చెందిన వారికి ఉపాధి కరువయ్యే ప్రమాదమున్నది. ఒక మిల్లులో జరిగే వ్యాపారం, దానికి అనుబంధంగా ఆధారపడిన వర్గాలను లోతుగా చూస్తే.. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం కనిపిస్తున్నది.
కేంద్రం వైఖరి మారాలి..
ఒక పక్క దేశంలో విభిన్న రంగాలకు చెందిన పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, రైస్ మిలర్లకు షాక్ నిచ్చే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరికాదు. దీని వల్ల మొత్తం రైస్ ఇండస్ట్రీ భవిష్యత్ ప్రశార్థకంగా మారే ప్రమాదమున్నది. పండిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత మేరకు కావాల్సిన నీళ్లు , 24 గంటల కరెంటు, రైతుబంధు కింద పెట్టుబడి ఇచ్చింది. ఇన్ని సౌకర్యాలు సమకూర్చినప్పుడు.. వాటిని కొనాల్సిన బాధ్యతను కేంద్రం విస్మరించడం సముచితం కాదు. ఇప్పటికైనా రైతులు, రైస్‌మిల్లులపై ఆధారపడిన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని బియ్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరమున్నది. అంతేకాదు పాత పద్ధతిలోనే కేంద్రం కొనుగోళ్లను యథావిధిగా చేయాలి.
ఇండస్ట్రీని కాపాడాలి..
రైతులు బతకాలంటే రైస్ మిల్లులుండాలి. అవి ఉన్నప్పుడే ధాన్యం సేకరణ ఉంటుంది. కేంద్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బియ్యం సేకరణపై క్లారిటీ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన సౌకర్యాల వల్ల ధాన్యం దిగుబడులు బాగా పెరుగుతున్నాయి. ఈ కారణంగానే ఉమ్మడి జిల్లాలో భారీగా రైస్ మిల్లుల ఏర్పాటుకు కొత్త వాళ్లు ఆసక్తి చూపారు. పరిస్థితులను అర్థం చేసుకొని రైస్ ఇండస్ట్రీస్ బతకాలంటే. ఎప్పటి మారిదిరిగానే కేంద్రం బియ్యం కొనుగోలు చేయాలి. యాసంగి పంటకు సంబంధించి 20శాతం రా రైస్ ఇవ్వాలనే నిబంధన పెట్టడం మంచి పద్ధతి కాదు. యాసంగి పంట అంతా బాయిల్డ్ అవుతుందే తప్ప రా రైస్ కాదు. ఈ విషయం తెలిసి కూడా.. మమ్మల్ని రా రైస్ కావాలని అడిగితే ఎలా సాధ్యమవుతుంది. పాత పద్ధతి ప్రకారమే కొనుగోళ్లు చేసి రైస్ ఇండస్ట్రీస్‌ను కాపాడాల్సిన అవసరం ఉన్నది.