ముత్తారం, డిసెంబర్ 3: కరోనా వ్యాక్సినేషన్లో ముత్తారం మండలం వెనుకంజలో ఎం దుకు ఉందని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ప్రశ్నించారు. ముత్తారం ప్రభుత్వ దవాఖానను శుక్రవారం ఆమె తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అనంతరం మండల వైద్యాధికారి వంశీకృష్ణతో కలెక్టర్ మాట్లాడారు. మండలంలో 18,485 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా, ఇప్పటి దాకా 15,081 (78)శాతం మందికి మొదటి డోసు, 5,992 (36) శాతం మందికి రెండో డోసు వేశామని వైద్యాధికారి తెలిపారు. వైద్యాధికారితోపాటు ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు, ఆశ, అంగన్వాడీలు గ్రామాల్లో పర్యటిస్తూ వారం రోజుల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.
మూడుసార్లు నీళ్లు పట్టాలి..
ఓడేడులోని నర్సరీని పరిశీలించారు. నర్సరీలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయం త్రం నీళ్లు పట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
తూకంపై కలెక్టర్‌కు ఫిర్యాదు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తూకంలో మోసం చేస్తున్నారని ఓడేడులోని కొనుగోలు కేంద్రంలో కలెక్టర్‌కు పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆమె అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో ఫోన్లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలపై నిఘా ఏర్పాటు చేయాలని, రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు. దీంతో రైతులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఓడేడులో ఆర్ఎంపీలతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన జగన్‌గౌడ్ కలెక్టర్‌తో మాట్లాడుతూ గ్రామంలోని డంప్‌యార్డ్‌లో చెత్తతోపాటు సర్జికల్ వ్యర్థ పదార్థాలు పొలాల్లోకి రావడంతో రైతులకు గాయాలవుతున్నాయని వివరించారు. అధికారులు సర్జికల్ వ్యర్థాలు చెత్త ట్రాక్టర్లలో వేయవద్దని, వాటిని తగులబెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో వేణుమాధవ్, ఆర్ఐ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులు స్వప్న, సంతోష్, శ్యాంప్రసాద్, ఉప సర్పంచ్ భానుకుమార్, పీఏసీఎస్ డైరెక్టర్ అల్లాడి యాదగిరిరావు, వార్డు సభ్యులు నరేడ్ల రమేశ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.