ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 కేంద్రాలు
ఈనెల 10న పోలింగ్.. అధికారుల ఏర్పాట్లు
కలెక్టరేట్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ
కరీంనగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 10న జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కరీంనగర్ ఉమ్మడిజిల్లావ్యాప్తంగా 8 ఓటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్ సిబ్బందికి శుక్రవారం శిక్షణ ఇచ్చారు, ఈ కార్యక్రమానికి హాజరైన కర్ణన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల పాత్ర కీలకమన్నారు. ఓటింగ్ కోసం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల జడ్పీ కార్యాలయాలు, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, హుస్నాబాద్‌లోని ఎంపీడీవో కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఒక్కో సెంటర్లో 200 మంది ఓటుహక్కు వినియోగించుకొనే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ జరుగుతుందన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హకు వినియోగించుకుంటారని తెలిపారు. ఎన్నికల అధికారులు తప్పనిసరిగా ఓటర్ ఐడీ కార్డు, ఎలక్షన్ కమిషన్ సూచించిన మేరకు 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి చూపించి ఓటేయాలని సూచించారు. ఓటర్లు ఎన్నికల అధికారి అందజేసే వాయిలెట్ స్కెచ్‌తో బ్యాలెట్ పేపర్‌పై అంకెలను ప్రాధాన్యత క్రమంలో వేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులు తగిన సూచనలు చేయాలని కోరారు. బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫాయిల్‌పై ఓటరు సంతకం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను చూపించిన తర్వాతనే సీల్ చేయాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం వారి సమక్షంలోనే సీల్ చేసి రిసెప్షన్ సెంటర్‌కు తీసుకురావాలని సూచించారు. ప్రతి పోలింగ్ సెంటర్‌కు ఏఆర్వో (అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి) ఉంటారని ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వారి దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ పోలింగ్ అధికారులకు సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు వెంకట్‌రెడ్డి, జగత్ సింగ్ పోలింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై సమగ్ర శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ ఉన్నారు.