మూడు రోజుల పోరుతో కేంద్రానికి బుద్ధిచెప్తం
72 గంటల సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలి
జీడీకే-11 గేట్ మీటింగ్‌లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
పాల్గొన్న జాతీయ కార్మిక సంఘాల నాయకులు
గోదావరిఖని, డిసెంబర్ 3 : ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-11 గనిలో టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఇక్కడ టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ పాల్గొని మాట్లాడారు. ఈ సమ్మెతో యాజమాన్యం దిగివస్తుందని అభిప్రాయపడ్డారు. సమ్మె నోటీసులో ఇచ్చిన అంశాలపై దృష్టిపెడుతామని, డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితిని 35 ఏండ్ల నుంచి 40 ఏండ్లకు పెంచాలని, గని ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన కార్మిక కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని, మారు పేర్లతో పనిచేస్తున్న కార్మికుల పేర్లు మార్పుచేయాలని, ఇతర డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి మేరుగు రాజయ్య, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి, బీఎంఎస్ యూనియన్ నాయకుడు లక్ష్మీనారాయణ, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు నారాయణ, ఐఎన్టీయూసీ నాయకుడు కే సదానందం మాట్లా డారు. సమావేశంలో టీబీజీకేఎస్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు, ఏఐటీయూసీ నాయకుడు అరెల్లి పోచం, పెద్ద సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఓసీ-2లో పిట్ సమావేశం..
మణుగూరు రూరల్, డిసెంబర్ 3 : ఓసీ-2లో టీబీజీకేఎస్ నేత కోటా శ్రీనివాస్ అధ్యక్షతన పిట్ సమావేశం నిర్వహించారు. టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వీ ప్రభాకర్‌రావు, ఏఐటీయూసీ రామ్‌గోపాల్, ఐఎన్టీయూసీ వెలగపల్లి జాన్, సీఐటీయూ లక్ష్మణ్‌రావు, బీఎంఎస్ వీరమనేని రవీందర్రావు, హెచ్ఎంఎస్ కుమార్, ఇఫ్టూ నాసర్‌పాషా మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు సామా శ్రీనివాసరెడ్డి, వీరభద్రయ్య, కాపా శివాజీ, కృష్ణ, సీహెచ్ అశోక్, బుర్ర వెంకటేశ్వర్లు, ఇతర పార్టీల నాయకులు నాగరాజు, నజీరొద్దీన్బాబా, మల్లేశ్, రామనర్సయ్య, బాలకృష్ణ, కరీం, బోగా రాజలింగు, వై రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, శివరావు, శ్రీకాంత్, కుమార్‌స్వామి, నరేశ్, లాలయ్య, మంగీలాల్, ఉప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
జీఎంకు వినతి..
రెబ్బెన, డిసెంబర్ 3 : బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే ఆపాలని కోరుతూ ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ ఆధ్వర్యంలో గోలేటి జీఎం కార్యాలయంలో జీఎం సంజీవరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగె ఉపేందర్, ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి సాగర్‌గౌడ్, ఇఫ్టూ ఏరియా అధ్యక్షుడు బండారు తిరుపతి, సీఐటీయూ నాయకులు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సమ్మెకు సంపూర్ణ మద్దతు..
తాండూర్, డిసెంబర్ 3 : జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ సింగరేణి గని కార్మిక సంఘం (టీఎస్జీకేఎస్) గౌరవ అధ్యక్షుడు గడ్డం సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మె దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులకు ఆదర్శంగా నిలువాలని పేర్కొన్నారు. కార్మికులు ఐక్యంగా నాయకత్వం వహించి, పోరాట పటిమను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.