కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 3: దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగుల సమస్యలను పరిషరించి, సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. దివ్యాంగుల్లో అనేక మంది నైపుణ్యం గల వారు ఉన్నారని, లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలో 21,139 మంది దివ్యాంగులకు ఆసరా పింఛన్లు మంజూరు చేసి, ప్రతి నెలా అందిస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగ మహిళలతో స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద 3,861 మంది దివ్యాంగులకు జాబ్‌కార్డులు జారీ చేసి పని కల్పిస్తున్నట్లు చెప్పారు. మరో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ మాట్లాడుతూ, జిల్లాలో దివ్యాంగులకు సంబంధించిన పోస్టులను రోస్టర్ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ మాట్లాడుతూ, పేదవారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సాయం అందిస్తామన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ల చేతుల మీదుగా అభయాత్రిత వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, డీఆర్డీవో శ్రీలత, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, సీడీపీవో సబిత, దివ్యాంగుల సంఘాల నాయకులు, అభయాత్రిత ఫౌండేషన్ చైర్మన్ చందా శంకర్రావు, ఎంఏ మజీద్, ఆకుల మల్లారెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.