‘బండి’ ఏం చేసిండు..? ఈటల ఏం చేస్తడు?
గెల్లును గెలిపిస్తే హుజూరాబాద్‌కు మంచి భవిష్యత్తు
ప్రజలారా తేల్చుకోవాల్సిన తరుణమిదే
ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి
ఉద్యమకారుడు, పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ను ఆదరించండి
జమ్మికుంట ఆటోనగర్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్
పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనానికీ హాజరు
సౌండ్స్ అండ్ లైట్స్ అసోసియేషన్ సభ్యుల మద్దతు
హుజూరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ)/ జమ్మికుంట/ జమ్మికుంట రూరల్;పదవులన్నీ అనుభవించిన ఈటల తన స్వార్థం కోసం అందలమెక్కించిన సీఎం కేసీఆర్‌కు నమ్మకద్రోహం చేశాడని, అతడికి ఓటుతోనే శిక్ష వేయాలని లేకపోతే నష్టపోతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పార్టీలో ఉన్నపుడే పథకాలను పరిగెలని విమర్శించిన ఆయన.. మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని.. రేపు గెలిచి ఏం పనులు చేస్తడని ప్రశ్నించారు. నాడు పేదోళ్లకు ఒక్క ఇల్లయినా కట్టివ్వని రాజేందర్ కావాలా.. ఉద్యమకారుడు, పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ గెలువాలా?.. ప్రజలారా ఒకసారి ఆలోచించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుతో కలిసి జమ్మికుంటలో పద్మశాలీ, సౌండ్స్ అండ్ లైటింగ్ డెకరేషన్స్ అసోసియేషన్, ఆటోనగర్ సొసైటీ సభ్యులు, కుటుంబాలు, హుజూరాబాద్‌లో యాదవ ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని.. గెల్లును ఆశీర్వదించాలని కోరారు.
‘టీఆర్ఎస్ను గెలిపిద్దామా? అభివృద్ధి నిరోధక బీజేపీని గెలిపిద్దామా? తేల్చుకునే సమయం ఆసన్నమైందని అభివృద్ధి అయినా.. సంక్షేమమైనా అది టీఆర్ఎస్కే సాధ్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం జమ్మికుంటలో ఆటోనగర్ అధ్యక్షుడు కృష్ణస్వామి ఆధ్వర్యంలో ఆటోనగర్ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ విజయతో కలిసి హాజరయ్యారు. ఇక్కడ కొప్పుల మాట్లాడుతూ, ఈటల గెలిస్తే హుజూరాబాద్ ప్రజలు అన్ని విధాలా నష్టపోతారని.. కారు గుర్తుకు ఓటేసి గెల్లు సీనును గెలిపించుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకొని పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్కే సంపూర్ణ మద్దతివ్వాలని కోరారు. అంతకుముందు మంత్రికి ఆటోనగర్ మహిళలు బతుకమ్మలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ అధ్యక్షుడు సంపత్, పార్టీ అర్బన్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, కోటి, మధుసూదన్, సత్యం, శ్రీనివాస్, రవీందర్‌తోపాటు 350 కుటుంబాలు(దాదాపు 2వేల మంది) పాల్గొన్నారు.
కేసీఆర్‌తోనే ‘చేనేత’కు పూర్వవైభవం
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పద్మశాలీల ఆకలిచావులు, ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మించి చేనేత రంగాన్ని కాపాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి హిందూశ్రీ ఫంక్షన్ హాల్లో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు బొద్దుల రవీందర్ ఆధ్వర్యంలో పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల హాజరయ్యారు. సంఘాలు, పరిశ్రమలను బలోపేతం చేయడంతో పాటు సబ్సిడీలు, బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఇలా అన్ని విధాలా చేయూతనిస్తున్న కేసీఆర్ సర్కారుకు పద్మశాలీలు అండగా ఉండి హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లును గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కౌన్సిలర్ బొద్దుల అరుణ, నాయకులు మల్లేశం, మల్లయ్య, రాజ్‌కుమార్, కోటి, సమ్మిరెడ్డి, అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
పనిచేసే సర్కారుకు అండగా ఉండండి
గెల్లుకే సంపూర్ణ మద్దతు
డెకరేషన్స్, సౌండ్స్ అండ్ లైటింగ్స్ అసోసియేషన్ మాది. వీటి మీద ఇక్కడ 90కుటుంబాలు ఉపాధి పొందుతున్నయ్. పనిచేసుకుని బతుకుతున్నం. ఇయ్యాల మమ్మల్ని మంత్రి, అభ్యర్థి, నాయకులు కలిసిన్రు. నిలువ నీడలేని పేదలకు ఇండ్లు కావాలని కోరినం. అడిగిన వెంటనే మాకు ప్రత్యేక కోటాలో ఇస్తమన్నరు. స్థలం ఉన్నోళ్లకు పైసలిత్తమన్నరు. ఇంతజేసిన పార్టీకే మద్దతు ఇచ్చినం. గెల్లు సీను గెలుపు కోసం పనిచేస్తాం.