ఏది కావాల్నో ఆలోచించుకోండి
ధరలు పెంచే బీజేపీని తరిమేద్దాం
సాయం చేసే టీఆర్ఎస్కు అండగా నిలుద్దాం
గెల్లును గెలిపించి, అభివృద్ధి వైపు అడుగులేద్దాం
హుజూరాబాద్‌లో మంత్రి గంగుల
ప్రచారానికి విశేష స్పందన
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 3: హుజూరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నరు. ఇప్పటికే 50కోట్లతో రోడ్ల పనులు కొనసాగుతున్నయి. వాటికి అదనంగా కోటీ 70 లక్షలతో రెండు బ్రిడ్జి పనులు నడుస్తున్నయి. ఆత్మగౌరవ ప్రతీకలుగా ప్రభుత్వమే కుల సంఘాల భవనాలు కట్టించి ఇస్తున్నది. ఈ అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లును గెలిపించాలి. సంక్షోభం సృష్టించే బీజేపీ కావాలో.. లేక పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ కావాలో మీరే ఆలోచించుకోవాలి.
ప్రజలపై ధరల భారం మోపుతున్న బీజేపీని తరిమికొట్టాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మేం ముందుకెళ్తుంటే.. అన్ని రంగాల్లో బీజేపీ సంక్షోభం సృష్టిస్తున్నదని ధ్వజమెత్తారు. ఆదివారం ఉదయం హుజూరాబాద్ పట్టణంలోని ప్రజలతో కలిసి బోర్నపల్లి 14వ వార్డు, ఇతర ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ఉంటేనే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెడుతాయని, మాజీ ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా టౌన్‌లోని 350 రోడ్లలో కనీసం మూడు రోడ్లు కూడా సరిగా వేయలేదని విమర్శించారు. స్థానికులు చెప్పులరిగేలా ఈటల చుట్టూ తిరిగి దరఖాస్తులు ఇచ్చినా స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, నీటి గోస తీర్చి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు, రైతన్నకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలతో రైతులు కుదేలవుతున్నారని, అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారని, రేపు మన పొలాల దగ్గర కరెంట్ మీటర్లు పెట్టబోతున్నారని ఆగ్రహించారు. మన జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘బీజేపీ వద్దు, టీఆర్ఎస్ ముద్దు’ అని ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జై.. తెలంగాణ, జై.. కేసీఆర్.. కారు గుర్తుకే మన ఓటు అని ఉత్సాహంగా నినదించారు. 14వ వార్డు టీఆర్ఎస్ ఇన్చార్జి గంట మధుకర్, కరీంనగర్ రూరల్ ప్యాక్స్ చైర్మన్ ఆనంద్‌రావు, నాయకులు దొంత రమేశ్, అనిల్‌యాదవ్, చందమళ్ల బాబు, కుమార్, సమ్మారావు, సంపత్‌రావు, కొమురయ్య, రాజు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.