దూదేకుల కుల సంఘం ఏకగ్రీవ తీర్మానం..
మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌కు తీర్మాన పత్రం అందజేత
కరీంనగర్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు హుజూరాబాద్ నియోజకవర్గంలోని దూదేకుల కులస్తులు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. సదరు తీర్మాన పత్రాన్ని ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌కు అందించారు. తెలంగాణ ముస్లిం, నూర్‌బాషా దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దా సాహెబ్ ఆధ్వర్యంలో మంత్రులను కలిసి మద్దతు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దూదేకుల కులస్తుల సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్ మంత్రులకు వివరించారు. కేసీఆర్ దూదేకులను గుర్తించారని, వారికి ఆత్మగౌరవ భవనం ఏర్పాటు చేయడం చారిత్రాత్మక అంశమని, తమకు సహకరించిన మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, హోం మంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మంత్రులు అజయ్ కుమార్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌కు దూదేకులు ధన్యవాదాలు తెలిపారు. హోం మంత్రి ఆదేశాల మేరకు ముస్లిం నూర్‌బాషా నాయకులు హుజూరాబాద్‌లో స్వచ్ఛందంగా గెల్లు శ్రీనివాస్ గెలుపునకు పని చేస్తున్నారని అన్నారు. అలాగే దూదేకులకు రాష్ట్ర, జిల్లా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని, దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.100 కోట్లు కేటాయించాలని, కేంద్రంలో బీసీ-ఈ 12 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, జనాభా దామాషా ప్రకారం దూదేకులకు బీసీ-ఈ వర్తింపజేయాలని, కోకాపేటలో దూదేకుల భవనం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, పలు జిల్లాల్లో ఖబరస్థాన్, మసీద్, వక్ఫ్ బోర్డు స్థలాలు రక్షణ లేక అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిని కాపాడాలని కోరారు. మంత్రులను కలిసిన వారిలో జాతీయ బాధ్యులు షకీనా, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు షేక్ జానీభాయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ సుభాన్ అలీ, అధికార ప్రతినిధి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ రషీద్, పొలిటికల్ కో ఆర్డినేటర్ షేక్ ఖాజామియా, రాష్ట్ర దీన్ కమిటీ సెక్రటరీ షే నాగులు మీరాతోపాటు నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.