ఒమిక్రాన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
విద్యానగర్, జనవరి 3: జిల్లాలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, కొవిడ్ థర్డ్‌వేవ్ రావొచ్చని డాక్టర్లు చెబుతున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. 15 నుంచి 18 ఏళ్లలోపు వయసున్న పిల్లలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు సోమవారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలో కొవిడ్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, అన్ని దవాఖానల్లో ఆక్సిజన్, వెంటిలేటర్, మెడికల్ ఎక్విప్మెంట్, సదుపాయాలు కల్పించామని తెలిపారు. అవసరమైన మందులు, ఇంజక్షన్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. కరోనా సంపూర్ణ నివారణకు ప్రతి ఒకరూ తప్పకుండా మాసు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో 18 పీహెచ్‌సీలు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కలిపి మొత్తం 26 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నామని, జిల్లా 64 వేల మందిని టీకాకు అర్హులుగా గుర్తించామని చెప్పారు. కొవిడ్ వ్యాక్సినేషన్లో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఇందుకు కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. అనంతరం వైద్య సిబ్బందితో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. అనంతరం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బాలింతలకు కేసీఆర్ కిట్‌ను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్, నగర మేయర్ వై సునీల్‌రావు, కార్పొరేటర్లు డిండిగాల మహేశ్, సరెల్ల ప్రసాద్, డీఎంహెచ్‌వో జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి, మాతా శిశు సంరక్షణ కేంద్రం పరిపాలన అధికారి డాక్టర్ అలీం తదితరులు పాల్గొన్నారు.