జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
169 మందికి కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
జగిత్యాల రూరల్, జనవరి 3: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు భరోసాగా నిలుస్తున్నాయని, కుల, మత బేధం లేకుండా వీటిని అమలు చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని సురభి గార్డెన్స్‌లో పట్టణానికి చెందిన 81మందికి షాదీముబారక్, 88 మందికి కల్యాణలక్ష్మి, మొత్తం 169 మందికి రూ.1.64కోట్ల విలువైన చెక్కులను సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు జగిత్యాల నియోజకవర్గంలో 8440మందికి ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా సంవత్సరానికి రూ.140కోట్లు ఖర్చు పెడుతున్నదని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి నెలా 30కోడిగుడ్లు, బలవర్దకమైన ఆహారం అందించడం ద్వారా తల్లి, పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని పేర్కొన్నారు. పట్టణ వాసులు నీటి సమస్యతో బాధ పడకూడదని మిషన్ భగీరథ పథకం ద్వారా జగిత్యాలలో కొత్త పైప్‌లైన్ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే పూర్తవుతాయన్నారు. జగిత్యాల పట్టణ నిరుపేదల కోసం నూకపల్లిలో 4500ఇండ్లు నిర్మిస్తున్నామని, త్వరలోనే పూర్తవుతాయన్నారు. కార్యక్రమంలో కమిషనర్ స్వరూపారాణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.