ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నేటి నుంచి పలు చోట్ల కార్యక్రమాలు
కరీంనగర్, జనవరి3 (నమస్తే తెలంగాణ): రైతుబంధు రైతన్న ఇంట సంబురాలు తెచ్చింది. పెట్టుబడికి ఒకరిని చెయ్యిచాపకుండా చేసింది. అప్పులు తెచ్చే తిప్పలు లేకుండా చేసింది. ఎరువుల బస్తాలు.. విత్తనాలు.. ట్రాక్టర్ కిరాయి.. కూలీలకు.. ఇలా సాగులో ఏ అవసరమైనా నేనున్నానంటూ భరోసానిచ్చింది. అంతటి మహత్తర పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది విడుతల్లో రూ.50 వేల కోట్లను విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీన ఈ లక్ష్యం పూర్తి కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఇవి సోమవారం ప్రారంభం కాగా, ఉమ్మడి జిల్లాలో సంబురాలు మొదలయ్యాయి.
వారం రోజులుగా ఎనిమిదో విడుత రైతుబంధు నగదు జమవుతుండడంతో రైతుల ఇండ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. బ్యాంకుల్లో జమైనట్లు తమ సెల్ఫోన్లకు వస్తున్న మెస్సేజ్లను చూసుకుని రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. యాసంగి సీజన్ మొదలైన నేపథ్యంలో తమ ఖాతాల్లో పడ్డ నగదును విడిపించుకుని పెట్టుబడికి వినియోగించుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు, దున్నడం, కూలీల ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. ఎనిమిది విడుతల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.50 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది. కాగా, ఉమ్మడి జిల్లాలో రైతుబంధు వారోత్సోవాలు మొదలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నేడు ఉమ్మడి జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు.
పంట పెట్టుబడులు తప్పినయ్.
రైతు బంధు పైసలు అత్తున్నయ్. పెట్టుబడికి వాడుకుంటున్న. ఒకప్పుడు కరెంటే ఉండేది కాదు. కరెంట్ కోసం పొద్దస్తమానం పొలం కాన్నే ఉండేది. చాన కట్టపడుకుంట ఎవుసం చేసేటోళ్లం. తెలంగాణ అచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ అయినంక మాకు ఎవుసం తిప్పలు తప్పినయ్. సీఎం కేసీఆర్ సారు నాకు నాలుగు ఎకరాలకు రూ.20వేయిల చొప్పున వానకాలం, యాసంగి కలిపి రూ.40వేయిలు ఇస్తుండు. పెద్ద మొత్తం కావట్టే ఏదన్న పని ఎల్లదీసుకునేటట్లు పని కస్తయ్. సెంట్రలోళ్లు ఇచ్చేది తక్కువనే. దేనికి సరిపోతయ్. రైతుబంధుతో పెట్టుబడి బాధలు తప్పినయ్. సీఎం కేసీఆర్ మాకు అండగా ఉంటుండు. రైతు కాలం జేత్తె పది దినాల్లోనే ఇంటికి రూ. 5లక్షలు రైతు బీమా ఇత్తుండు. గింత జేస్తున్న కేసీఆర్ సార్ ముందట సెంట్రల్ సర్కారోళ్ల జేత్తున్నదేంత! ఉల్టా వడ్లు కొనేది లేదనవట్టిరి.
-జొంగోని సదయ్యగౌడ్, రైతు, తొగర్రాయి (సుల్తానాబాద్ రూరల్)
మోటర్ సైకిల్ కొన్న..
నాకు మా నాయనకు కలిపి 3 ఎకరాల 10 గుంటల భూమి రెండక్కల్ల ఉంది. గత 10 ఏండ్ల నుంచి పాత సైకిల్ మీదనే పొలానికి వెళ్లి పనులు చేసుకుంటున్న. బండి కొనుక్కుందామంటే సంపాదనే లేదాయె. అప్పుడు ఎవుసమైతే చేసినంగాని ఏం మూటగట్టుకోలే. అచ్చిన పైసలన్నీ పెట్టుబడులకు, ఇంటి ఖర్చులకే చాలకపోతుండె. ఇగ బండి కల అట్లనే ఉన్నది. కేసీఆర్ రైతు బంధు కింద పెట్టుబడి సాయం ఇచ్చినప్పటి సందే ఇంత ఆసర దొరికింది. మాకు పసలుకు 16,250 వస్తున్నయ్. గత వానకాలం, యాసంగి పైసలకు ఇన్ని కలుపుకొనే ఓ మోటర్ సైకిల్ కొనుక్కున్న. దానిమీదనే పొలానికి పోతన్న. రైతు బంధుకు వచ్చిన తర్వాతనే పంట పైసలు మిగులుతున్నయి. ఇన్ని ఎనుక వడుతున్నయి. చానా సంతోషంగ ఉంది. రైతుల కోసం ఎప్పుడూ ఆలోచించే కేసీఆర్ సార్ మా దేవుడు.-బోడకుంటి రాజయ్య, రైతు, రాజక్కపల్లి(వెల్గటూర్)
కష్టకాలంల చేతికందినయ్..
నాకు ఎల్లారెడ్డిపేట్ల 10 ఎకరాల భూమి ఉన్నది. మొన్నటిదాక పొలం పండించేందుకు ఎన్నో బోర్లేసిన. ఒక్కటి గూడ సక్కగ పడలేదు. అప్పుల పాలయిన..మిత్తిలు కట్టేందుకు తిప్పలు పడుతున్న. గిసొంటి కష్టకాలంల రైతుబంధు డబ్బులు రూ. 50వేలు నిన్ననే బ్యాంకు ఖాతాల పడ్డయ్. పొద్దుగాళ్ల ఫోన్ల మెస్సేజ్ చూడంగనే మస్తు సంతోషమని పించింది. వెంటనే ఖాతా బుక్ పట్టుకొని బ్యాంకుకు వెళ్లి పైసలు తెచ్చుకున్న. ఈ యాసంగి పంటలు వేసేదేట్ల అని రందీ పెట్టుకున్న. కష్టకాలం చేతికందినయ్..లాగోడికి అక్కరకత్తయ్..వీటితో ఎరువులు, విత్తనాలు కొంట. నాకు సర్కారు ద్వారా ఏడాదికి లక్ష రూపాయల్ వస్తున్నయ్..నాలాంటి రైతులకు మేలు జేత్తున్న కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.-సాదు పద్మారెడ్డి, రైతు, ఎల్లారెడ్డిపేట.
ఖర్చులకు అక్కరకత్తున్నయ్….
మాకు ఐదెకరాల భూమి ఉన్నది అండ్ల మూడెకరాల పత్తి పండించినం.రెండెకరాలు జాలుపొలం వరి పండిద్దామనుకుంటున్నం. కైకిలికి, లాగోడికి బగ్గ కర్సులయితుండె. రైతు పొలం ఎంతగనం జేసిన కర్సులను తల్సుకుంటే లాభం లేదనిపిస్తుండె. రైతు బంధు అచ్చినంక కర్చులకు ఆసరలెక్క అక్కరకత్తున్నయ్. మాకు ఐదెకెరాలకు యాడాదికి రూ.50వేలు అత్తున్నయి. పొలం జేసెతందుకు సెయితిరుగున్నది. లేక పోతే మొత్తం అప్పేతెచ్చి సేసుడైతె రైతుకు ఏం మిగులుకపోయేది.
-చెరుకూరి మంజుల, మహిళారైతు,దుమాల, ఎల్లారెడ్డిపేట.