తొలిరోజు విజయవంతం కరీంనగర్లో మంత్రి గంగుల,నియోజకవర్గాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యేలు
పలు పీహెచ్‌సీలను సందర్శించిన వైద్యాధికారులు
సిబ్బందికి సూచనలు, సలహాలు
విద్యానగర్, జనవరి 3: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 నుంచి 18 ఏండ్ల వయసు కలిగిన పిల్లలకు సోమవారం కొవిడ్ టీకా పంపిణీ మొదలైంది. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో 1,814 మందికి వేయగా, కరీంనగర్ జిల్లాలో 700, రాజన్నసిరిసిల్లలో 139, జగిత్యాలలో 500, పెద్దపల్లిలో 475 మందికి వ్యాక్సిన్ వేశారు. కరీంనగర్ జిల్లా దవాఖానలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఆయాజిల్లాల వైద్యాధికారులు పలు ఆరోగ్యకేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్ తీరును పరిశీలించి, వైద్యసిబ్బందికి సలహాలు సూచనలు ఇచ్చారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సోమవారం 15 నుంచి 18 ఏండ్ల వయసు గల వారికి వ్యాక్సినేషన్ విజయవంతంగా ప్రారంభమైంది. కరీంనగర్‌లోని ఎంసీహెచ్‌లో మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించగా, మానకొండూర్ పీహెచ్సీలో జిల్లా సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బోయినపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల జిల్లా దవాఖాన, ఖిల్లాగడ్డ పీహెచ్సీలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మెట్పల్లి యూపీహెచ్‌సీలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసా గర్‌రావు, పెద్దపల్లి ప్రధాన దవాఖానలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి టీకా పంపిణీని ప్రారంభించారు. అపోహలు వీడి అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 1814 మంది మొదటి డోస్ వేసుకున్నారు.