రాంనగర్, జనవరి 3 : కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం రాత్రి ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు, సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఈ నెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, సంజయ్‌తోపాటు మరో నలుగురిని కరీంనగర్ జైలుకు తరలించారు. ఈ విషయాన్ని కరీంనగర్ సీపీ సత్యనారాయణ వెల్లడించారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా, హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా, ఎలాంటి అనుమతి లేకుండా బండి సంజయ్ ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేయడంతో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున బండి సంజయ్‌ను పీటీసికి తరలించగా, అక్కడికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా హంగామా చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆ తర్వాత దీక్ష పేరిట కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు దీక్షను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై దాడి చేశారంటూ హుజూరాబాద్ సీఐ వీ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో 16 మందిపై కేసు నమోదు చేశారు. ఆ మేరకు టూటౌన్ పోలీసులు బండి సంజయ్‌తోపాటు పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కచ్చు రవి, మర్రి సతీశ్‌ను సోమవారం కోర్టులో హాజరు పరిచారు. సంజయ్‌పై గతంలో వివిధ ప్రాంతాల్లో పది కేసులు నమోదై ఉన్నట్లు, అలాగే మిగతా పదకొండు మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో కోర్టుకు తెలిపారు. సంజయ్ తరుపు న్యాయవాదులు అక్రమ అరెస్టు అని, పోలీసులపై నిందితులెవరూ దాడులు చేసి గాయపరచలేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రిమాండ్‌ను వెనక్కి తీసుకోవాలని మేజిస్ట్రేట్‌ను అభ్యర్థించారు. వీరి వాదనలతో ఏకీభవించని మేజిస్ట్రేట్ సంజయ్‌తోపాటు మిగతా నలుగురికి ఈనెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. తర్వాత పోలీసులు వారిని కరీంనగర్ జైలుకు తరలించారు.