ఈటల ఎమ్మెల్యే, మంత్రిగా ఉండి ఏంజెయ్యలే..
ఇప్పడు ప్రతిపక్షంలో ఉండి ఏంజేస్తడు?
తన బాధను ప్రజలపై రుద్దుతున్నడు
హుజూరాబాద్ ప్రజలే ఆలోచించాలి
టీఆర్ఎస్ ఇచ్చింది చెప్పింది.. ఇవ్వబోయేది చెప్తున్నది
బీజేపీ ఏంజేసింది చెప్పదు.. ఏంజేస్తదో చెప్పదు..
గెల్లును గెలిపిస్తే 5వేల ఇండ్లు కట్టించే బాధ్యత నాదే
కమలాపూర్ మండలం కన్నూరు ధూంధాం సభలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు
కమలాపూర్, అక్టోబర్ 2;‘నేను రాజీనామా చేస్తేనే పథకాలు వచ్చినయ్ అంటున్నవ్.. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు పథకాలు నువ్వు రాజీనామా చేస్తేనే వచ్చినయా..? ఆసరా పింఛన్లు నువ్వు రాజీనామా చేస్తెనే వస్తున్నయా?’ అని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిలదీశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరులో శనివారం రాత్రి నిర్వహించిన ధూంధాం సభకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హాజరయ్యారు. తన బాధను ప్రజలపై రుద్దేందుకు ఈటల ప్రయత్నిస్తున్నాడని, ఆయన మొసలి కన్నీళ్లు.. మాయమాటలకు ఎవరూ మోసపోవద్దని మంత్రి సూచించారు.
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతున్నారు. శనివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి కమలాపూర్ మండలంలోని గుండేడు, కొత్తపల్లి, తీగలపల్లె, రాములపల్లె, కన్నూరు గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలుకరించారు. వృద్ధులతో ముచ్చటించడంతో పాటు దారి వెంట కలిసిన ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. యువతతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా ముందుకు కదిలారు. తనను నిండు మనసుతో ఆశీర్వదిస్తే గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆయాచోట్ల గెల్లుకు ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలు కోలాటాలు, ఒగ్గుడోలు కళాకారులు డప్పుచప్పుళ్లతో హోరెత్తించారు.
ఈటల గెలుపు కోసమే డమ్మీ అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్
బీజేపీ నేత ఈటల రాజేందర్ గెలుపు కోసమే రేవంత్‌రెడ్డి డమ్మీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఈటల నుంచి 25 కోట్లు తీసుకొని బీజేపీ గెలుస్తదని నాతో అన్నడు. అప్పుడే పార్టీని వీడాలనుకున్న. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరిన. హైదరాబాద్‌లో రాత్రి వేళలో లైట్లు ఎలా వెలుగుతున్నాయో.. ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అలానే లైట్లు వెలుగుతున్నయి. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హారీశ్‌రావు కృషే. ఏడేండ్లు మంత్రిగా పని చేసిన ఈటల తన స్వగ్రామైన కమలాపూర్‌లో ఆర్టీసీ బస్టాండ్ నిర్మించలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు గెలిచి ఏం చేస్తడు? గెల్లు శ్రీనును గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తడు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలి.
పేదల ఇండ్లయితే కట్టలె..ఆయన ప్యాలెస్ కట్టుకున్నడు..
హుజూరాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నాలుగువేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిండు. కానీ, ఈటల రాజేందర్ ఏం చేసిండు? ఒక్క ఇల్లూ కట్టలే. ఆయన మాత్రం హైదరాబాద్‌ల ప్యాలెస్ కట్టుకున్నడు. ఇదేం న్యాయం? ప్రజలను మోసం చేసిండు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రాజీనామా చేసిండు. ఎస్సీ, బీసీల భూముల బలవంతంగా గుంజుకున్నడట. తప్పుచేయకపోతే విచారణను ఎదుర్కొవాలే. కానీ, అన్నం పెట్టిన తల్లిలాంటి టీఆర్ఎస్కు ద్రోహం చేసి బీజేపీలో సొచ్చుడేంది? మరి ఆ పార్టీ ఏం చేస్తాంది? తెలంగాణకు ఏమైనా ఒరగబెట్టిందా..? దేశవ్యాప్తంగా 30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్కటీ భర్తీ చేయలే. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణతో ఉన్న కొలువులను ఊడగొడుతున్నది. అదే మన రాష్ట్ర సర్కారు ఈ ఏడేండ్లలో లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీచేసింది. ఇంకా 50వేల నుంచి 80వేల కొలువులు భర్తీ చేస్తది. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఒక్క ఇల్లు కట్టని ఈటల.. ఒక్క ఉద్యోగమివ్వని బీజేపీకి ఓటేస్తరో.. కడుపుల పెట్టుకొని చూసుకునే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తరో..? ఈటల గెలిస్తే రుపాయి పాయిదా ఉండదు. నాకు ఒక్క అవకాశమివ్వండి. మీ సేవకుడిగా పనిచేస్త. కేసీఆర్‌తో మాట్లాడి వంద కోట్ల స్పెషల్ ఫండ్ తెస్త. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుత. ఐదు వేల ఇండ్లు కట్టిస్త. హుజూరాబాద్‌లో మెడికల్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్త.
అభివృద్ధికి లక్ష రూపాయలు ఇవ్వలె
కన్నూరు గ్రామాభివృద్ధి కోసం లక్ష రుపాయలు మంజూరు చేయాలని గతంల మస్తు తిరిగినం. అప్పటి నాయకుడు పట్టించుకోలె. కానీ, ఇప్పుడు మంత్రి హరీశ్‌రావుకు మా గ్రామ సమస్యలు చెప్పంగనే స్పందించిండు. గ్రామాభివృద్ధి రెండున్నర కోట్లు నిధులు మంజూరు చేసిండు. అలాగే మిగిలిన పనులు చేసుకునేందుకు నిధులిస్త అన్నడు. మాకు నమ్మకమున్నది. అందుకే రాబోయే ఎన్నికల్లో ఊరంతా కారు గుర్తుకు ఓటేసి మెజారిటీ చూపిస్తే మన గ్రామం కోసం ఏది అడిగిన ఇస్తరు. గ్రామస్తులంతా ఏకతాటిపై నడుద్దాం. టీఆర్ఎస్కు ఓటేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. నిధులు మంజూరు చేసిన హారీశ్‌రావుకు కృతజ్ఞతలు.