బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా
శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యానికి సాయం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 113 మందికి రూ. 1.22 కోట్ల చెల్లింపులు
సిరిసిల్ల, జనవరి 2: ఉమ్మడి పాలనలో అంతరించి, పట్టింపులేకుండా ఉన్న కులవృత్తులు స్వరాష్ట్ర సాధన అనంతరం ఊపిరిపోసుకున్నాయి. కులవృత్తులవారు దర్జాగా బతుకుతున్నారు. పనిలో చేయూతనివ్వడమే కాకుండా మృతిచెందిన వారి కుటుంబాలకు అర్థిక సాయం అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2018 నుంచి 2021 వరకు శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, మృతి చెందిన కుటుంబాలకు చెందిన 113 మందికి రూ.1.22కోట్ల సాయం అందించారు. గీత కార్మికుల ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తాటి చెట్టు ఎక్కుతుంటారు. గాలి వర్షాలు వచ్చిన సమయంలో చెట్టుపై నుంచి జారి పడి తీవ్ర గాయాలపాలవడం, పరిస్థితిని బట్టి శాశ్వత వైకల్యం, ఒక్కోసారి ప్రాణాలను కోల్పోవడం జరుగుతున్నది. ఇలాంటి సంఘటలతో వారిపై ఆధారపడి బతుకున్న వారి స్థితిగతులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. ఉమ్మడి పాలనలో ఎన్నో కుటుంబాలు అప్పటి ప్రభుత్వం అందించే అరకొర సాయం సరిపడక వీధిన పడ్డాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్ గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని నిశ్చయించారు. నవంబర్ 2019 నుంచి మృతిచెందిన గీత కార్మికులకు చెందిన కుటుంబాలకు రూ.5లక్షలు, శాశ్వత వైకల్యం పొందిన వారికి రూ.5లక్షలు, తాత్కాలిక వైకల్యం పొందిన వారికి రూ.10వేల ఎక్స్గ్రేషియా అందిస్తూ గీత కార్మికుల కుటుంబాల్లో సర్కారు భరోసా నింపుతుంది. నవంబర్ 2019కి ముందు మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షలు, శాశ్వత వైకల్యం పొందిన వారికి రూ.50వేలు,తాత్కాలిక వైకల్యం పొందిన వారికి రూ.10వేల ఎక్స్గ్రేషియా అందించారు. ప్రభుత్వం అందించిన అర్థిక సాయంతో బాధితులు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఎంతో మంది గీత కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా మారి ఆదుకుంటున్నారు.
సభ్యత్వం తప్పనిసరిగా ఉండాలి
గీతకార్మికులు తప్పనిసరిగా సొసైటీలో ఎక్సైజ్ శాఖ ఆమోదించిన సభ్యత్వ నమోదు . ప్రభుత్వ గుర్తింపు పొందిన సభ్యులకు పథకాలు, ఎక్స్గ్రేషియా అందుతాయి. కార్మికులు తప్పనిసరిగా సభ్యత్వం చేయించుకోవాలి. ఇప్పటివరకు జిల్లాలో 113 మందికి రూ.1.22 కోట్ల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం అందించింది.
కుటుంబాన్ని ఆదుకుంది
ఏడాది క్రితం చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి పోవడంతో తలకు తీవ్రగాయమైంది. అపరేషన్కు పెద్దమొత్తంలో ఖర్చయింది. చెట్టు పై నుంచి పడడంతో మెదడు పూర్తి స్థాయిలో పనిచేయకుండా అయి చెట్టు ఎక్కలేకపోయాను. దీంతో ఏ పని చేసుకోకుండా అయింది. శక్తి లేక ఇబ్బందిలో ఉన్న నాకు సీఎం కేసీఆర్ సార్ రూ.5లక్షలు సాయం చేసిండు. వచ్చిన పైసల్లో కొన్ని దవాఖానకు పోగా మిగిలిన పైసలతో చిన్న దుకాణం పెట్టుకుని బతుకుతున్నాం.