ఊరూరా సాగవుతున్న అపరాలు, కూరగాయలు
మక్క, పల్లికి ప్రథమ ప్రాధాన్యం
ఇప్పటికే 10వేల ఎకరాల్లో సేద్యం పెరిగే అవకాశం
కరీంనగర్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) ;కేంద్రం యాసంగి వడ్లు కొనేది లేదని స్పష్టం చేసిన తర్వాత జిల్లాలోని రైతులు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. మక్క, పల్లి పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మినుము, శనగ, పొద్దు తిరుగుడు, అలసంద, కూరగాయల పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గతంలో వాన కాలం, యాసంగి రెండు సీజన్లు ఒకే క్షేత్రంలో కేవలం వరి మాత్రమే సాగు చేసే రైతులు ఇపుడు అవే క్షేత్రాల్లో ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. వరి నాట్లు వేసిన పొలాలను ఇపుడు దుక్కులుగా మార్చి మక్క, పల్లి పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా జిల్లాలో ఆరుతడి పంటల శాతం పెరుగుతున్నది. డిసెంబర్, జనవరిలో కూడా కొన్ని రకాల ఆరుతడి పంటలు సాగు చేసుకునే అవకాశం ఉన్నందున ఆరుతడి విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి వరకు అత్యధికంగా మక్క, పల్లి పంటలు సాగైనట్లు అధికారులు చెబుతున్నారు.
మల్టీ పంటల క్షేత్రం..
రామడుగు మండలం రాంచంద్రాపూర్కు చెందిన ఎగుర్ల భారతమ్మ క్షేత్రంలో చూస్తే తీరొక్క పంట కనిపిస్తున్నది. ఒక పక్క కూరగాయలు, మరో పక్క మిర్చి, ఇంకో పక్క కంది, పెద్ద మొత్తంలో పల్లి కనిపించింది. సాధారణంగా భారతమ్మ తమ క్షేత్రంలో గతంలో వరి, పత్తి ఎక్కువగా చేసేది. పల్లి, మక్క ఏటా సాగు చేసినా తక్కువగా ఉండేది. ఇపుడు వరిని పూర్తిగా తగ్గించి దాని స్థానంలో పల్లి, టమాట పంట సాగు చేశారు. మిగతా రెండెకరాల్లో పల్లి వేశారు. గత యాసంగి సీజన్లో 20 గుంటల్లో ఉల్లి సాగు చేసిన భారతమ్మకు రూ.70 వేలు లాభం వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే ఉత్సాహంలో మరో చోట ఉన్న తమ మూడెకరాల్లో ఒక ఎకరంలో ఉల్లిసాగు చేస్తున్నారు. మిగిలిన రెండెకరాల్లో పల్లి వేస్తున్నామని చెబుతున్నారు భారతమ్మ.
వరి బదులు పల్లి సాగు..
ఇక్కడ నీళ్లు పారిస్తున్న మహిళా రైతు గుమ్మడి ఝాన్సీ. ఊరు రామడుగు మండలం గుండి. ఝాన్సీ ఉమ్మడి కుటుంబానికి 20 ఎకరాల భూమి ఉంది. ఆమె నీళ్లు పెడుతున్న దుక్కిలో ఇప్పటికే పల్లి వేసి, తొలి తడి అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ క్షేత్రంలో వానాకాలం పత్తి, యాసంగిలో వరి సాగు చేసేవాళ్లు. కానీ ఇపుడు వరికి బదులు పల్లి విత్తుకున్నారు. వరి సాగు చేస్తే వడ్లు కొనమని కేంద్రం స్పష్టం చేయడంతో ఝాన్సీ భర్త శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇపుడు వీళ్లకు ఉన్న 20 ఎకరాల్లో ఒక్క ఐదెకరాల్లోనే విత్తనో త్పత్తి కోసం ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుని వరి సాగు చేస్తున్నారు. మిగతా 15 ఎకరాల్లో ఐదెకరాలు పల్లి సాగు చేస్తున్నారు. మిగతా 10 ఎకరా ల్లో వాటర్ మిలన్, మిస్క్మిలన్ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో 10-15 ఎకరాల్లో వరి సాగు చేసే ఈ రైతు ఇపుడు కేవలం ఐదెకరాల్లో అది కూడా విత్తనోత్పత్తికి మాత్రమే వరి సాగు
చేసుకుంటున్నారు.
సీడ్ వడ్లకే పరిమితమైనం..
మా ఏరియాకు ఎల్లంపల్లి నీళ్లచ్చేవరకు ఈ మూడు నాలుగేండ్ల నుంచి చాలా మంది రైతులు వరి మీద వడ్డరు. అంతకు ముందు నీళ్లు లేనపుడు వసతి చూసుకొని అన్ని పంటలు పండించేది. ఇపుడు వడ్లు కొనమని చెప్పినంక ఆరుతడి పంటలే మంచిదని అంటున్నరు. పది పదిహేనెకరాలున్న రైతులు మూడు నాలుగేండ్ల నుంచి ఎక్కువ వరే పెట్టేది. ఇపుడు పల్లి, మక్క, ఇంత కూరగాయలు పెట్టుకుందామని చూస్తున్నరు. పంట మార్పు మంచిదే. కానీ రైతులు అలవాటు పడాలే. మేం ఈ సారి వరి వద్దే వద్దు అనుకున్నం. ఆడ, మగ సీడ్ కింద ఓ ఐదెకరాలు ఏస్తున్నం. వీఎన్ఆర్ సీడ్స్ కంపెనీతోని ఒప్పందమైంది. మా ఏరియాలో సీడ్ కోసమే రైతులు ఎక్కువ వరి సాగు చేస్తున్నరు.