సిరిసిల్లలో పాఠశాలలపై అందమైన చిత్రాలు
పిల్లలకు ఆహ్లాదాన్ని పంచేలా పాఠ్యాంశాల్లోని బొమ్మలతో ఆర్ట్స్
అమాత్యుడు కేటీఆర్ చొరవతో ఏర్పాటు
పిల్లల్లో స్కూళ్లపై ఆసక్తి
పెరుగుతున్న హాజరుశాతం
సిరిసిల్ల, నవంబర్1;అంతరిక్షం, విమానాశ్రయం, టీ-హబ్, చేనేత వస్త్ర పరిశ్రమ, లలిత కళలు, గోల్కొండకోట, డబుల్ డెక్కర్ బస్, సీ-వరల్డ్, జూ-పార్క్, కాళేశ్వరం ప్రాజెక్ట్, పంట పొలం చిత్రాలు.. ఇవన్నీ ఏ ఫిల్మి సిటో, లేక నగరంలోనో అనుకుంటే పొరపాటే.. ఇవి మన రాజన్నసిరిసిల్లలోని సర్కారు బడులు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నియోజకవర్గంలోని పాఠశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. పిల్లల్లో విద్యపై ఆసక్తిని.. అభ్యసనా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా 24 బడులను తీర్చిదిద్దుతుండగా, ఎంతో ముచ్చట గొలుపుతున్నాయి. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడమే కాదు హాజరుశాతాన్ని పెంచుతూ, అభ్యసనానికి దోహదపడుతున్నాయి.
విద్యపై ఆసక్తిని.. విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్లలోని బడులు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎస్సార్ నిధులతో వివిధ రకాల పాఠ్యాంశాల్లోని చిత్రాలు స్కూల్, తరగతి గోడలపై వేస్తుండడంతో నయా లుక్ సంతరించుకుంటున్నాయి. ప్రధానంగా గోల్కొండ, అంతరిక్షం, వ్యవసాయం, ఆధారిత రంగాలు, జూపార్క్, డబుల్‌డెక్కర్ బస్సు వంటి చిత్రాలు వేస్తూ కార్పొరేట్ స్కూళ్లను మరిపించేలా తీర్చిదిద్దుతుండడంతో విద్యార్థుల్లోనూ విద్యపై ఆసక్తే కాదు హాజరు శాతం, ప్రవేశాల సంఖ్య కూడా పెరుగుతున్నది. పిల్లలు చదివింది గుర్తుండేందుకు దోహదపడుతున్నాయి. నియోజకవర్గంలోని ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో 24 పాఠశాలల గోడపై వాల్‌ఆర్ట్స్ వేస్తుండగా, ఇప్పటివరకు 14 పాఠశాలల్లో పూర్తయ్యాయి.
ఏ స్కూల్లో ఏ బొమ్మ..
గంభీరావుపేట మండలం గంభీరావుపేట గాంధీ చౌక్ స్కూల్లో టీ-హబ్, గోరంట్యాలలో వ్యవసాయం, ఆధారిత రంగాలు, దమ్మన్నపేట మోడల్ స్కూల్లో అక్వేరియం, దమ్మన్నపేట ప్రాథమిక పాఠశాలలో చేనేత వస్త్ర పరిశ్రమ, నర్మాలలో అంతరిక్షం, లింగన్నపేటలో లలిత కళలు, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో గోల్కొండకోట, గొల్లపల్లిలో డబుల్ డెక్కర్ బస్, బొప్పాపూర్‌లో సీ-వరల్డ్, గుండారంలో జూ-పార్క్, వీర్నపల్లి మండలం మద్దిమల్లలో విమానాశ్రయం, వీర్నపల్లిలో రైలు, రంగంపేటలో బతుకమ్మ, కాకతీయ తోరణం, ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్ చిత్రాలు వేయిస్తున్నారు.