పదవులిచ్చి తమ్ముడిలా చూసుకుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతవా
నీతి.. రీతి లేనిది నీకే..
ఏ సిద్ధాంతంతో బీజేపీలో చేరినవ్
నీకు ప్రజలపై ప్రేమ ఉన్నదా?
ఉంటే ఒక్క ఇల్లయినా కట్టించినవా..
భీంపల్లి సభలో హరీశ్‌రావు నిప్పులు
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని పిలుపు
దుమ్మురేపిన ధూంధాం
టీఆర్ఎస్ నేతలకు మంగళహారతులతో గ్రామస్తుల ఘన స్వాగతం
కరీంనగర్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ):“ఆదరించి పదవులిచ్చి తమ్ముడిలా చూసుకున్న కేసీఆర్‌పైనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నవ్.. ఈటలా.. నీకిది తగునా”అని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. కమలాపూర్ మండలం భీంపల్లిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ధూంధాంలో విప్ బాల్క సుమన్, హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని కుండబద్దలు కొట్టారు. పుట్టినప్పటి నుంచే లెఫ్టిస్ట్నని చెప్పుకొంటున్న ఈటల ఏ సిద్ధాంతంతో బీజేపీలో చేరాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటలకు పదవులు కావాలి తప్ప సిద్ధాంతాలతో పనిలేదని విమర్శించారు. ‘నీకు లేదు నీతి.. నీవు చేరిన బీజేపీకి లేదు నీతి’ అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేసిందా? గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ పెంచిందా? పెట్రోల్ రేట్లను తగ్గించిందా? చెప్పి ఓట్లు అడగాలని ఈటలకు సవాల్ చేశారు. ‘కేసీఆర్‌కు మానవత్వం లేదంటున్నవ్.. రెండు వేలు పింఛన్ తీసుకుంటున్న ముసలవ్వనడుగు కేసీఆర్‌కు మానవత్వం ఉందో లేదో? రైతుబంధు తీసుకుంటున్న రైతునడుగు కేసీఆర్‌కు మానవత్వం ఉందో లేదో? ప్రభుత్వ దవాఖానలో కాన్పు చేసుకున్న చెల్లెనడుగు కేసీఆర్‌కు మానవత్వం ఉందోలేదో చెప్తరు” అంటూ నిలదీశారు. ‘పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టివ్వుమని హుజూరాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నాలుగు వేల ఇండ్లు మంజూరు చేస్తే ఒక్కటన్న కట్టియ్యకపోతివి.. నీకు ప్రజలపై ప్రేమ ఉందా? ఉంటే కట్టియ్యకపోదువా’ అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడే పనులు చేయని ఈటల రేపు ప్రతిపక్ష బీజేపీలో ఉంటే ఏం పనులు చేస్తాడో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపిస్తే ఐదు వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించే బాధ్యత తనదంటూ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ ఎన్నికల ఖర్చు కోసం ఇద్దరు చిన్నారులు విరాళం అందజేశారు. మంత్రి హరీశ్ సమక్షంలో భీంపల్లికి చెందిన చిన్నారులు లాస్య, దీక్షిత్ తమ కిడ్డీబ్యాంక్‌లో దాచుకున్న డబ్బును గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశారు.
దుమ్ము రేపిన ధూంధాం
టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భీంపల్లిలో చేపట్టిన ధూంధాం దుమ్మురేపింది. మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో తరలివచ్చారు. గ్రామస్తులు కోలాటాలు, డప్పు చప్పుళ్లతో మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికారు. కళాకారుడు సాయిచంద్ పాడిన పాటలకు ప్రజలు నృత్యాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ సమక్షంలో పలు గ్రామాల బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. గ్రామానికి చెందిన గౌడన్నలు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, సర్పంచ్ జవ్వాజి పద్మ, ఉపసర్పంచ్ ప్రవీణ్‌రెడ్డి, నాయకులు నవీన్‌కుమార్, లక్ష్మణ్‌రావు, లింగంపల్లి కిషన్‌రావు, కుమారస్వామి, ప్రభాకర్ పాల్గొన్నారు.