కరీంనగర్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): సెక్టోరల్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో సెక్టోరల్ అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కరెంట్, టాయిలెట్స్, ఫర్నీచర్, ర్యాంపులు తదితర సౌకర్యాలు ఉన్నాయోలేవో తెలుసుకోవాలని సూచించారు. వసతులు లేకుంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవోలు, ఏపీఓలు, ఓపీవోలు, సిబ్బంది కొవిడ్ డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నివేదించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేసే రాజకీయ పార్టీలు, వ్యక్తులపై కేసులు నమోదు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల రూట్లను ముందుగానే చూసుకోవాలని, పోలింగ్ సామగ్రి, సిబ్బందితో ఒకరోజు ముందుగానే సెంటర్లకు చేరుకోవాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకు తప్పనిసరిగా ఏజెంట్ల ఎదుట మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. మాక్ పోలింగ్ తర్వాత డాటా క్లియర్ చేసి, వీవీ ప్యాట్లలో స్లిప్స్ లేకుండా సీల్ వేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వీవీ ప్యాట్లను తనిఖీ చేయవద్దని చెప్పారు. సెక్టార్ అధికారులకు శనివారం ఉదయం 10 గంటలకు హుజూరాబాద్‌లో వాహనాలు సమకూర్చాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ను ఆదేశించారు. బీఎల్వోల ద్వారా ఓటర్ జాబితాను చెక్ చేసుకోవాలన్నారు. ఈవీఎంలు అన్ని సెక్టోరల్ అధికారుల నియంత్రణలో ఉంటాయని, పోలింగ్‌రోజు రిజర్వ్ ఈవీఎంలను కూడా పోలింగ్ కేంద్రాలను వెంట తీసుకెళ్లాలన్నారు. పబ్లిక్ హెల్త్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా ఆగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ అగర్వాల్, ఆర్అండ్బీ, హెల్త్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.