మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్లో ఉచిత యునానీ మెగా వైద్య శిబిరం ప్రారంభం
విద్యానగర్, ఫిబ్రవరి 1: వందల సంవత్సరాల చరిత్ర కలిగిన యునానీ వైద్యంతోనే దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లోని నేషనల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత యునానీ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కీళ్ల నొప్పులు, చర్మ రోగాలు, కిడ్ని సమస్యలు, జీర్ణకోశ, షుగర్, పక్షవాతం, ఎలర్జీ, అస్తమా వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం ఒక యునానీలోనే అందుబాటులో ఉన్నదన్నారు. యునానీ అన్నమాట అయోనియా అన్న గ్రీకు పదం నుంచి వచ్చిందని మంత్రి తెలిపారు. గ్రీకు దేశానికి మరొక పేరు యునానీ అని, ఈ వైద్యం ఆ దేశంలో రెండో శతాబ్దంలో పుట్టిందని వివరించారు. కానీ, దీనిని తొమ్మిదో శతాబ్దపు పారశీక వైద్యుడు హకీం బిన్ సేనా హకీం ప్రచారంలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. యునానీ మందులు ప్రకృతి నుంచి తయారు చేసివేనన్నారు. ఆయూష్ విభాగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాంనగర్లో ఏర్పాటు చేసిన ఆయూష్ విభాగానికి త్వరలోనే పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ఓపీ మాత్రమే చూస్తున్నారని, త్వరలోనే 50 పడకలతో ఐపీ సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు. మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ, ఆయూష్ విభాగానికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సందర్భంగా వెయ్యి మందికి పైగా పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీ డాక్టర్ వీ రవినాయక్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యస్రబ్ సుల్తానా, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణీహరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, స్థానిక కార్పొరేటర్లు గౌసియా బేగం, జహరాబాను, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.