భరోసా కల్పిస్తూ… మందుల కిట్ల పంపిణీ
ఇంటింటా అవగాహన కల్పించిన జ్వర సర్వే బృందాలు
వంద శాతం వ్యాక్సినేషన్, జ్వర సర్వే పూర్తి
చిగురుమామిడి, ఫిబ్రవరి 1: అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ప్రణాళికతో లక్ష్యాన్ని సులువుగా చేరుకున్నారు. కరోనా విపతర పరిస్థితుల నెదురొని వైద్య సిబ్బంది మండలంలో జనవరి 20 నుంచి 30 వరకు జ్వర సర్వే చేపట్టారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తూ మండల ప్రజల మన్ననలు పొందారు. వంద శాతం దిశగా ముందుకెళ్లారు.
100% వ్యాక్సినేషన్
మండల ఆరోగ్య కేంద్రంతోపాటు మండలంలోని 17 గ్రామాలకు గాను 8 ఆరోగ్య కేంద్రాలున్నాయి. మొదటి రెండో డోసులు కలిపి 32,955 మందికి టీకాలు వేసినట్లు సూపర్వైజర్ హాజీబాబా తెలిపారు. 100 శాతం టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల వారు 2131 మందికి టీకాలు వేసి 74 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. మండలంలోని చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, నవాబుపేట, సుందరగిరి, ముదిమాణిక్యం, ములనూర్లోని ఆరోగ్యకేంద్రాల్లో వైద్యాధికారులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలున్నట్లయితే కరోనా టెస్ట్ చేస్తూ కిట్లను అందజేశారు.
13,294 ఇండ్లు .. 17 బృందాలు…
మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు 17 బృందాలుగా ఏర్పడి 13,294 ఇళ్లను సర్వే చేశారు. అన్ని గ్రామాల్లో జనవరి 20 నుంచి 30 వరకు సర్వే పూర్తి చేశారు. ఇంటింటా తిరిగి కరోనా లక్షణాలున్న 387 మందిని గుర్తించి 387 కిట్లను అందజేశారు. వారు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. మాసు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఐసొలేషన్పై అవగాహన కల్పించారు.