సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): నగరంలో రంజాన్ శోభ సంతరించుకున్నది. రంజాన్ నెలవంక భారత్లో బుధవారం కనిపించింది. దీంతో గురువారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ఉపవాసదీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం నెలపాటు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. కాగా, రంజాన్ మాసం దాదాపు 31 ఏండ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్నట్లు ముస్లిం మతపెద్దలు చెప్పారు. గతంలో 1995 ఫిబ్రవరి 1న రంజాన్ మాసం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడే మళ్లీ ఫిబ్రవరిలో రంజాన్ ప్రారంభం కావడం విశేషం. మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును కల్పిస్తూ..ప్రభుత్వం ఎప్పటిలాగే ఉత్తర్వులు జారీ చేసింది.