కలెక్టర్ ఆర్వీ కర్ణన్
వివిధ శాఖల అధికారులతో సమీక్ష
కరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్ట్ అదనపు టీఎంసీ కాలువ నిర్మాణానికి భూసేకరణ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ అదనపు టీఎంసీ కాలువ నిర్మాణానికి భూసేకరణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూములకు ప్రభుత్వం నుంచి మంచి ధర వచ్చేలా కృషి చేస్తామని రైతులకు వివరించాలని సూచించారు. రామడుగు మండలంలో భూసర్వే పనులు చివరి దశకు చేరుకున్నాయని, గంగాధర మండలం గర్శకుర్తి, ఉప్పరమల్యాల, కురిక్యాల గ్రామాల్లో సర్వేను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్, రామడుగు, గంగాధర మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాలపై దృష్టిసారించాలి
కార్పొరేషన్, ఫిబ్రవరి 1: మున్సిపల్, గ్రామ పంచాయతీల పరిధిలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని ఆదేశించారు. మున్సిపల్ చట్టం ప్రకారం కొత్త పన్నులు వసూలు చేయాలని, బడ్జెట్ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో నర్సరీలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఆడిట్ అధికారి రాము, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీవోలు పాల్గొన్నారు.