కార్పొరేషన్, ఫిబ్రవరి 1: నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్డు ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఆమె నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణల తొలగింపుపై పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలోని 14.5 కిలో మీటర్ల మేర ప్రధాన రహదారుల్లో ఆక్రమణలను తక్షణమే తొలగించాలన్నారు. వారం రోజుల్లోగా ఫుట్‌పాత్‌లు, రోడ్డు ఆక్రమణలను తొలగించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఇందుకోసం పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి బృందం కిలో మీటర్ మేర రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించాలని సూచించారు. ముందుగా వ్యాపారులకు స్వచ్ఛందంగా సామగ్రి తీసేలా అవగాహన కల్పించాలన్నారు. తిరిగి ఆక్రమిస్తే తొలగించాలని ఆదేశించారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులు వారికి కేటాయించిన ప్రదేశంలోనే విక్రయించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆక్రమణలను తొలగించి, వాహనాలు, ప్రజల రాకపోకలు సులభంగా సాగేలా చూడాలన్నారు. ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. వారం రోజుల్లో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలు కనిపించకుండా చూడాలన్నారు. మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, ఆర్డీవో ఆనంద్‌కుమార్, ఏసీపీలు రాములు, విజయ్‌కుమార్, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.