కొవాగ్జిన్ వేసేందుకు నిర్ణయం
పెద్దల తరహాలోనే 28 రోజుల తర్వాత రెండో డోస్
డబుల్ డోస్ పూర్తయిన వారికి వచ్చే వారం నుంచి బూస్టర్ డోస్
రంగంలోకి వైద్య, ఆరోగ్యశాఖ
జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు
కరీంనగర్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కరోనా అంతానికి యువకులు, పెద్దలపై టీకాస్త్రం ప్రయోగించి సక్సెస్ అయిన రాష్ట్ర సర్కారు 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకూ వ్యాక్సిన్ వేయబోతున్నది. ఈ నెల 3వ తేదీ నుంచి కొవాగ్జిన్ ఇవ్వాలని నిర్ణయించింది. మొదటి డోస్ వేసిన 28 రోజుల తర్వాత రెండో డోస్ వేయాలని ఆదేశాలు రాగా, వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. అయితే గతంలో మాదిరిలా సెంటర్లు ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో మాత్రమే టీకా వేసేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో వచ్చే వారం నుంచి 60 ఏండ్లు పైబడిన వారితో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి 15నుంచి 18 ఏండ్లలోపు పిల్లలకు కరోనా టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న కొవాగ్జిన్ వేయాలని నిర్ణయించారు. పెద్దల మాదిరిగానే పిల్లలకు కూడా రెండు డోసు ల్లో టీకాలు ఇవ్వనున్నారు. మొదటి డోసు వేసిన 28 రోజుల తర్వాత రెండో డోసు టీకాలు ఇస్తారు. ఈ కేటగిరి వయసు వాళ్లు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం చదివే పిల్లలే ఎక్కువ మంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కాగా టీకాలు పెద్దల మాదిరి అన్ని చోట్ల కాకుండా వైద్యులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో మాత్రమే వేస్తున్నారు.
ఒమిక్రాన్ నుంచి సేఫ్టీ కోసమే..
కొవిడ్ నుంచి రక్షణ పొందేందుకు ఇక పిల్లల వంతు వచ్చింది. ఇప్పటి వరకు 18 ఏండ్లపైబడిన వారికి మాత్రమే కోవిడ్ టీకాలు వేశారు. ఈ కేటగిరి వయసు వారికి అన్ని జిల్లాల్లో మొదటి డోసు టీకాలు వంద శాతం, రెండో డోసు టీకాలు 65 నుంచి 75 శాతం దాటాయి. ఒమిక్రాన్ వంటి వేరియంట్స్ విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లలకు కూడా కరోనా నుంచి రక్షణ కల్పించాలని సంకల్పంచిన ప్రభుత్వం, ఈ నెల 3 నుంచి 15 నుంచి 18 ఏండ్లలోపు వారికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో వైద్య, ఆరోగ్య శాఖ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని జిల్లాల కలెక్టర్లు పిల్లలకు కరోనా టీకాలు వేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు అందుబాటులో ఉన్న కోవాగ్జిన్ వేయాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో ప్రారంభించిన తర్వాత 50 ఏండ్లు పైబడిన వారికి, ఆ తర్వాత దీర్ఘకాలిక రోగాలతో బాదపడుతున్న వారికి ప్రాధాన్యత ఇచ్చి టీకాలు వేశారు. ఈ క్రమంలో చివరిగా 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు టీకాలు వేస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థ ప్రతిపాదన మేరకు 12 నుంచి 18 ఏండ్లలోపు ఉన్న పిల్లలకు కూడా టీకాలు వేయాలని మొదట నిర్ణయించారు. ఆతర్వాత 15-18 ఏండ్లలోపు వారి కి మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇపుడు ఈ కేటగిరి పిల్లలకు మాత్రమే టీకాలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనేపథ్యం లో జిల్లాల వారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి..
రెండు డోసులు తప్పని సరి..
పెద్దల మాదిరిగానే పిల్లలకు కూడా రెండు డోసుల టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. పెద్దల్లో అయితే రెండో డోసుకు కొంత ఎక్కువ వ్యత్యాసం ఉన్నా పిల్లల్లో మాత్రం 28 రోజులకే రెండో డోసు వేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో ఈ కేటగిరి పిల్లలు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికి టీకాలు వేసేందుకు అన్ని జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కేటగిరి పిల్లలు ముఖ్యంగా 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులే ఎక్కువగా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే పెద్దల మాదిరిగా ఎక్కడబడితే అక్కడ ఈ టీకాలు ఇవ్వడం లేదు. వైద్యులు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్భన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ప్రధాన దవాఖానాలు, ఏరియా వైద్యశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మాత్రమే పిల్లలకు టీకాలు వేస్తున్నట్లు కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా తెలిపారు. కరీంనగర్ జిల్లాలో అయితే ఈ కేటగిరి పిల్లలు 64-65 వేల మంది ఉండవచ్చని ఆమె తెలిపారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు మరో వెయ్యి మంది దాకా ఉండే అవకాశం ఉందని వివరించారు..
వచ్చే వారం నుంచి బూస్టర్ డోస్..
కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు రెండు డోసుల కరోనా టీకాలు వేసుకున్న వారికి కూడా బూస్టర్ డోసు టీకా వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం నుంచి ఈ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా 60 ఏండ్లు పైబడిన వారితో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులకు బూస్టర్ డోసు టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది జనవరి నుంచి ప్రారంభమైనట్లుగానే విడతల వారీగా, వయసుల వారీగా ఈ బూస్టర్ డోసు టీకాలు ఇచ్చే అవకాశం ఉంది.