సకల జనుల సంక్షేమమే సర్కారు ధ్యేయం
అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ రాద్ధాంతం
మంత్రి కొప్పుల ఈశ్వర్
మెట్పల్లి మండలం ఆత్మకూర్, కొండ్రికర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం
మెట్పల్లి రూరల్, జనవరి 1: డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. రాష్ట్రంలోని సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తుందని పేర్కొన్నారు. అభివృద్ధిని ఓర్వలేకే బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూర్‌లో రూ.1.64 కోట్లతో 16 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించగా 12 ఇండ్లు, కొండ్రికర్లలో రూ. 1.81 కోట్లతో 17 ఇండ్లను నిర్మించగా 13 ఇండ్లకు శనివారం మంత్రి స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఆయాచోట్ల కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. గతానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం గూడులేని వారికి ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని చెప్పారు. కరోనాతో ఆదాయం తగ్గిందని, లేదంటే నియోజక వర్గానికి ఐదువేల ఇండ్లు నిర్మించేదని పేర్కొన్నారు. త్వరలోనే కొత్త పింఛన్ల మంజూరు చేస్తుందన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. ప్రభుత్వం రైతుబంధు కింద ఏటా రూ. 12 వేల కోట్లు వెచ్చించి 62లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తున్నదని చెప్పారు. రూ. 1500 కోట్లతో రైతు బీమా, రూ. 10 వేల కోట్లతో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నదని చెప్పారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని నిప్పులు చెరిగారు. రాష్ట్ర బీజేపీ నేతలు అభివృద్ధికి సహకరించకుండా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని, పసుపు బోర్డు హామీ ఏమైందని ప్రశ్నించారు.
అర్హులందరికీ ఇండ్లు: ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
ఆత్మకూర్, కొండ్రికర్ల గ్రామాల్లో అర్హులందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు హామీనిచ్చారు. ఇండ్లురాని పేదలు నిరాశ చెందవద్దన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలుకావడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ఇక్కడ సర్పంచులు చౌట్పల్లి లావణ్య, ఆకుల రాజగంగు, జడ్పీటీసీ కాటిపెల్లి రాధాశ్రీ, ఎంపీపీ మారు సాయిరెడ్డి, కలెక్టర్ రవి, ఆర్డీవో వినోద్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కేసీరెడ్డి నవీన్‌రెడ్డి, ఎంపీటీసీ తుమ్మల పుష్ప, ఉప సర్పంచులు నేరెళ్ల శ్రీధర్, రాజేశ్వర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.