హుజూరాబాద్‌టౌన్, అక్టోబర్ 31: హుజూరాబాద్ శాసన సభ ఉపఎన్నికలు శనివారం ముగియడంతో, ఆదివారం అంతా నిశ్శబ్ద వాతావరణం కమ్ముకుంది. రెండు నెలల పాటు ఎంతో శ్రమించిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రోజంతా పార్టీ శ్రేణులతో బిజీగా గడిపారు. హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో తన అనుచరులు, వివిధ మండలాలకు చెందిన నాయకులు, మద్దతుదారులతో మండలాల్లో, గ్రామాల్లో ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. గ్రామాల వారీగా పోలింగ్ జరిగిన తీరు, పోలైన ఓట్లు, టీఆర్ఎస్కు, ఇతర పార్టీలకు వచ్చే ఓట్ల శాతాన్ని నాయకులను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ ఆగడాలపైనా చర్చించారు.
ప్రజాబలం నాకే: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్
ప్రజా బలం కచ్చితంగా తనకే ఉందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అనుచరులతో ఎన్నికల సరళిపై ఆదివారం చర్చించారు. తనను గెలిపించేందుకు ఓటింగ్‌లో పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మారెట్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్నో అడ్డదారులు తొకిందని, గ్రామాల్లో మద్యం ఏరులై పారించిందని విమర్శించారు. డబ్బులు పంచుతూ బీజేపీ నాయకులు ప్రతి చోటా అల్లర్లు సృష్టించాలని చూశారని పేర్కొన్నారు. అన్ని అక్రమ మార్గాలను వినియోగించుకోవడంతో పాటు సోషల్ మీడియాలో టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్పై ఉన్న నమ్మకంతో ప్రజలు అధికారి పార్టీవైపే మొగ్గు చూపారని పేర్కొన్నారు. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, న్యాయవాదులు పులుగు లింగారెడ్డి, ఆకుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఎండీ రియాజ్, చందమల్ల బాబు, సంపంగి రాజేందర్, ఎస్ కె ఫయాజ్, మోరే మధు, ఆకుల వెంకటేశ్, సామల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు