కార్పొరేషన్, అక్టోబర్ 31: నగరంలోని శ్రీ చైతన్య పీజీ కళాశాలలో ఆదివారం మాజీ హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి విద్యా సంస్థల చైర్మన్ రమేశ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సదాశివశర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో పటేల్ చేసిన సేవానిరతి మరిచిపోలేనిదన్నారు. యువత పటేల్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు అవగాహన ర్యాలీ తీశారు. విద్యా సంస్థల ప్రతినిధులు నరేందర్‌రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో..
రాంనగర్, అక్టోబర్ 31: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ కేంద్రంలో పటేల్ చిత్రపటానికి సీపీ వీ సత్యనారాయణ పూలమాల వేసి, నివాళులర్పించారు. అలాగే, కమిషనరేట్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లు, సరిల్ కార్యాలయాలు, డివిజన్ కేంద్రాల్లో పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్ (లా అండ్ ఆర్డర్), జీ చంద్రమోహన్ (పరిపాలన), సిటీ ఆర్మ్డ్ రిజర్వు ఏసీపీ ప్రతాప్, ఎస్బీఐ జీ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు మల్లేశం, మురళి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
శాతవాహన యూనివర్సిటీలో..
కమాన్ చౌరస్తా, అక్టోబర్ 31: శాతవాహన యూనివర్సిటీలో రిజిస్ట్రార్ డాక్టర్ వరప్రసాద్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ శ్రీవాణి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురసరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జాతీయ విలువలను పెంపొందిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రిజిస్ట్రార్ డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒకరూ ఐక్యత, సమగ్రతను పెంపొందించుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ శ్రీవాణి మాట్లాడుతూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జీవిత సత్యాన్ని తెలుసుకొని విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ విజయకుమార్, డీ విజయకుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.