ముకరంపుర, అక్టోబర్ 31: భారీ వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే పద్మనగర్ బైపాస్ రహదారి ప్రమాదరహితంగా మారింది. హైదరాబాద్, వరంగల్ నుంచి సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ఎన్ట్టీఆర్ విగ్రహం నుంచి పద్మనగర్ మీదుగా రాకపోకలు సాగించేలా ప్రత్యేకంగా ఈ మార్గాన్ని నిర్మించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరుకుల రవాణా, ప్రయాణికుల వాహనాల కోసం ప్రత్యేకంగా ఈ దారిని నిర్మించారు. గతంలో రోడ్డు నిర్మాణంలో ఉన్న లోపాలు, సాంకేతిక తప్పిదాలతో ఈ మార్గంలో ప్రయాణం వాహనదారులకు ప్రాణసంకటంగా ఉండేది. చిమ్మచీకట్లో నిత్యం ప్రమాదాలతో భయం భయంగా రాకపోకలు సాగించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పద్మనగర్-ఎన్టీఆర్ బైపాస్ రోడ్డుపై ప్రత్యేక దృష్టిసారించింది.
భద్రతకు పెద్దపీట
పద్మనగర్ బైపాస్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం రహదారి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. నగర శివారులో ఉన్నందున దారికి ఇరువైపులా పలు కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. ఒక వైపు నుంచి మరో వైపునకు, డివైడర్ల మధ్య నుంచి రోడ్డు దాటే వీలులేకుండా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. పద్మనగర్తో పాటు ఎన్టీఆర్ విగ్రహం కూడలి వరకు పలు చోట్ల ప్రమాదకరంగా ఉన్న మలుపులను గుర్తించారు. ఆయా ప్రాంతాలకు కొద్ది దూరంలో వాహనదారులను అప్రమత్తం చేసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వాహనాల వేగాన్ని నియంత్రించేలా శాస్త్రీయంగా స్పీడ్ బ్రేకర్లు నిర్మించారు. వందలాది వాహనాలు రాకపోకలు సాగించే దారిలో పాదచారులకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా నడకదారులను తీర్చిదిద్దారు. రోడ్డుపైకి వెళ్లే అవకాశం లేకుండా నేరుగా తమ మార్గంలో ముందుకు వెళ్తూ తమ ప్రాంతాలకు చేరుకునేలా అంతర్గత రోడ్లకు నడకదారులను అనుసంధానించారు. చిమ్మచీకటిగా ఉండే ఈ దారిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో మరింత ఆకర్షణీయంగా మారింది. ఎల్ఈడీ వెలుగు జిలుగులు, ఓ వైపు దిగువ మానేరు జలాశయం.. మరోవైపు సెంట్రల్ లైటింగ్ అందాలతో ఈ మార్గంలో ప్రయాణం వాహనదారులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నది.
నాలుగు వరుసల రహదారికి అనుసంధాన కూడలిగా
పద్మనగర్ శివారు నుంచి బావుపేట వరకు చేపడుతున్న నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో పద్మనగర్ బైపాస్ రోడ్డు భవిష్యత్లో మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది. దీంతో పాటు పునర్నిర్మాణంలో ఉన్న ఎలగందుల పాత రోడ్డు పనులు పూర్తయితే మరింత రద్దీగా మారనుంది. నాలుగు వరుసల రహదారి, ఎలగందుల పాత రోడ్డు నుంచి రాకపోకలు సాగించే వాహనాలతో పద్మనగర్ బైపాస్ ముఖద్వారం ప్రధాన కూడలిగా మారనుంది. ఈ ప్రాంతానికి ప్రత్యేక శోభను తీసుకురానుంది.