గోదావరిఖని, సెప్టెంబర్ 1: డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాలని, రోజూ 1.85లక్షల టన్నులు వెలికి తీయాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల జీఎంలతో బుధవారం వీసీ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాల సాధనకు చేపట్టాల్సిన ప్రణాళికలను వివరించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తమవంతుగా ఈ ఏడాది నిర్దేశించిన 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణాకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. తెలంగాణలో బొగ్గు కొరత లేనప్పటికీ పొరుగు రాష్ర్టాల్లో రెండు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచాలని కేంద్రం కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికలు, నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, ఓసీపీల్లో ఓబీ తొలగింపునకు ఒప్పందాలు, వాటి పనితీరు, నూతన ప్రాజెక్టు ఓపెన్‌కాస్టు-5కు సంబంధించిన పనుల పురోగతి, అండర్‌గ్రౌండ్ గనుల యంత్రాల వినియోగం, తదితరులు అంశాలపై చర్చించారు. వీసీలో ఆర్జీ జీఎం నారాయణ, మేడిపల్లి ఓసీపీ పీవో సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
ప్రతి ఉద్యోగికి అభినందనలు
యైటింక్లయిన్ కాలనీ, సెప్టెంబర్1 : సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అత్యధిక ఉత్పత్తి సాధనలో భాగస్వాములైన ప్రతి ఉద్యోగికి అభినందనలని సంస్థ సీఎండీ నడిమెట్ల శ్రీధర్ వెల్లడించారు. సెప్టెంబర్‌లో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు పనుల్లో మెరుగైన ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఏరియా స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుని ఉద్యోగులకు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరముందని తెలిపారు. ఏమైనా వనరులు అవసరముంటే తమ దృష్టికి తీసుకువస్తే సత్వరమే అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఆర్జీ-2 ఏరియాలో ఆగస్టులో 127శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడంపై సీఎండీ సంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు దానికి కృషి చేసిన జీఎం, ఉద్యోగులను అభినందించారు. వీసీలో ఆర్జీ-2 ఏరియా జీఎం వెంకటేశ్వర్రావు, ఎస్వోటూ జీఎం సందనాల సాంబయ్య, ఏరియా ఇంజినీర్ రాధాకృష్ణారావు, ప్రాజెక్టు అధికారి జీ మోహన్ రెడ్డి, డీజీఎం(ఎ) ఎర్రన్న, డీజీఎం(ఐఈడీ) మురళీ కృష్ణ, పర్యావరణ అధికారి రాజారెడ్డి, ఐటీ మేనేజర్ సుబ్రహ్మణ్యం, డీజీఎం (ప) జీ ప్రదీప్ కుమార్ ఉన్నారు.