మీ జిమ్మెదారి మేం తీసుకుంటాం
ఏ తొవ్వలపోతే పనైతదో గుర్తించాలి
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపు
ఈటల ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఎందుకు కట్టలేదని ప్రశ్న
ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నడంటూ ధ్వజం
బోర్నపల్లిలో పెద్దమ్మ గుడి, దమ్మకపేటలో యాదవ సంఘ భవన నిర్మాణాలకు శంకుస్థాపన
జమ్మికుంటలో 1500 మంది టీఆర్ఎస్లో చేరిక
కండువా కప్పి ఆహ్వానించిన అమాత్యుడు
హుజూరాబాద్/ జమ్మికుంట రూరల్, సెప్టెంబర్ 1;ఆరేండ్ల కిందట కరెంట్‌లేక మస్తు తిప్పలవడ్డం.. రాత్రిపూట నిద్రసంపుకొని బాయిలకాడనే పడుకునేటోళ్లం.. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడూ కాలిపోయేవి.. పంటలు నడిమిట్లనే ఎండిపోయేవి.. తెలంగాణ అచ్చినంక ఈ కరెంట్ తిప్పలు తప్పినయ్.. ఇప్పుడు 24 గంటలు ఉత్తగనే ఇత్తున్రు.. పంటలు మంచిగ పండించుకుంట రందిలేకుండ ఉన్నం. గిట్ల రైతుల కోసం కరెంటిత్తున్న కేసీఆర్ సారుకు దండం పెట్టాలె..
“రైతు బతుకులకు భరోసానిచ్చి కేసీఆర్ రైతు బంధువైండు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ద్రోహిగా మారింది.. రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ జరుగుతుంది.. మీ ఓటు ఎటు వైపు? 60 రూపాలయల గడియారానికా, కేసీఆర్ కిట్టుకా..? కుట్టు మిషిన్లకా, కల్యాణలక్ష్మికా..? రూపాయి బొట్టు బిళ్లకా, ఆసరా పింఛన్లకా..? మీరే ఆలోచించుకోవాలి. వాళ్లిచ్చే తాయిలాలకు ఆశ పడి మోసపోవద్దు. మేం మాటలు చెప్పటోళ్లం కాదు.. పనులు చేసేటోళ్లం” అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలో పెద్దమ్మ గుడి, దమ్మక్కపేటలో యాదవ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. జమ్మికుంటలోని వ్యవసాయ మార్కెట్లో సీపీఐ, ఏఐటీయూసీ, టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్మికులు 1500 మంది టీఆర్ఎస్లో చేరగా, మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ఆయాచోట్ల ప్రసంగించారు.
ఈటల నిర్లక్ష్యంతోనే ఇకడ ఇళ్లు పూర్తి కాలేదు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రతి మంత్రితో పాటు రాజేందర్‌కు కూడా 4 వేల ఇళ్లు ఇచ్చారని, దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఇళ్లు కట్టి పేదోళ్లందరికీ ఇచ్చామన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా 5 వేల ఇళ్లు కట్టారని, తాను 3600 ఇళ్లు నిర్మించగా, శ్రీనివాస్ గౌడ్ 3300 ఇళ్లు, పక్క నియోజకవర్గమైన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి 850 ఇళ్లు పూర్తి చేశారన్నారు. దురదృష్టం ఏమిటంటే ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన ఇళ్లల్లో ఒక్కటి కూడా ఈటల ఎందుకు కట్టివ్వలేదో ఆయనకే తెలియాలన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న 3 వేల ఇళ్లను పూర్తి చేయడంతోపాటు ప్రతి గ్రామంలో పేదలకు ఇళ్లు తప్పకుండా నిర్మిస్తామన్నారు. టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పనుల గురించి అక్కాచెల్లెళ్లు ఆలోచించాలని, ఏ తొవ్వలో పోతే, ఎవరిని కలిస్తే పని అయితదో ఏ రకంగా పోతే జరుగుతదో ఆలోచన చేసుకోవాలని కోరారు. బరువు తమదేనని, బాధ్యత తమదేనని, జిమ్మెదారి తాము తీసుకుంటామన్నారు. మరొకరికి మద్దతు ఇచ్చి తమని బాధ్యత తీసుకోమంటే ఎట్ల సాధ్యమైతుందని, దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలి
గెల్లు శ్రీను ఉద్యమకారుడు అని, ప్రత్యేక రాష్ట్రం కోసం 20ఏళ్లు బరిగేసి కొట్లాడాడన్నారు. ఉద్యమంలో అతనిపై 130 కేసులు నమోదయ్యాయని, 20 రోజులు చంచల్ గూడ, 10 రోజులు చర్లపల్లి జైళ్లకు వెళ్లాడని పేర్కొన్నారు. దున్నపోతుకు గడ్డివేసి బర్రె పాలు పితికితే రావని, పని చేసే వాళ్లకే అండగా ఉండాలని కోరారు. ఏడేళ్లు రాజేందర్ మంచిగా పని చేస్తే.. ఇవాళ గడియారాలు, కుట్టుమిషన్లు పంచాల్సిన అవసరం ఎందుకు వస్తుందన్నారు. 40 వేల కుంకుమ భరిణిలు మహిళలకు పంచడానికి ఎందుకు సిద్ధం చేస్తున్నాడో చెప్పాలన్నారు. హుజూరాబాద్‌లో లో వోల్టేజీ సమస్య ఉందని తన దృష్టికి కొందరు తీసుకువచ్చారని, దీనికోసం రూ.కోటీ 50 లక్షలతో కొత్త సబ్ స్టేషను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సైదాపూర్-బోర్లపల్లి రోడ్ గుంతలమయంగా మారిందని, దీనికోసం రూ.3 కోట్లు, ఇప్పల్‌నర్సింగాపూర్ బ్రిడ్జి, రోడ్ కావాలని రైతులు అడిగారని, వీటి కోసం రూ.కోటీ 70 లక్షలు మంజూరు చేస్తున్నానని పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యేగా, కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ఉంటే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఢోకా లేదన్నారు. బీజేపీ మార్కెట్‌యార్డులను రద్దు చేసిందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదన్నారు. రైతులపై రబ్బర్ బులెట్లు, భాష్పవాయువులతో దాడి చేస్తున్నది బీజేపేనని వివరించారు.
కాళేశ్వరంతో నీళ్ల రంది తీరింది
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నీళ్ల రంది తీరిందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. పంట పెట్టుబడి కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.10 వేలు అందిస్తుండగా, కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందన్నారు. లీటర్‌కు రూ.63 ఉన్న డీజిల్ రూ.100కు పెంచడంతో ట్రాక్టర్ దున్నడానికి రూ.3 వేలు ఉన్న కిరాయి రూ.5 వేలకు చేరుకుందని, మరికొన్ని ప్రాంతాల్లో రూ.6వేలు తీసుకోవడంతో రైతుల గోస వర్ణానాతీతంగా ఉందన్నారు. మనకు సాయం చేసేటోళ్లు ఎవరో, అన్యాయం చేసేటోళ్లు ఎవరో ఇప్పటికైనా గమనించాలని కోరారు. రైతుల కోసం 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నది ఎవరు? అని.. పండిన పంట మొత్తం కొంటున్నది ఎవరో కొంచెం ఆలోచన చేయాలన్నారు.
ఉన్న నౌకర్లు ఊడగొట్టింది బీజేపీ కాదా!
కేంద్రంలో ఉన్న బీజేపీ అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేసి ఉన్న ఉద్యోగాలు ఊడగొడితే.. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు లక్షా 35 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే, విశాఖ ఉక్కు, తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. టీఎస్ ఐపాస్‌తో ప్రవేశపెట్టి 16వేల పరిశ్రమలను తీసుకువచ్చి చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామన్నారు. మరో 50 వేల నుంచి 60వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.
రేవంత్‌రెడ్డి అమ్ముడుపోయాడు : కౌశిక్‌రెడ్డి
ఈటల రాజేందర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమ్ముడు పోయాడని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే ఈటల గెలుస్తాడు అని మీడియాలో చెప్పాడని గుర్తు చేశారు. బీజేపీ గెలుస్తుందని ఆయన అన్నందుకే ఆ పార్టీ నచ్చక టీఆర్ఎస్లో చేరానని తెలిపారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేనివిధంగా వందల సంఖ్యల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నల్ల చట్టాలను తీసుకువచ్చిందని చెప్పారు. రైతులకు అండగా కేసీఆర్ నిలిచి సాగునీరు, నిరంతర విద్యుత్ అందిస్తూ రైతు పంటలను కొనుగోలు చేశారన్నారు. ఈటల రాజేందర్ ఆత్మగౌరవం అంటూ సొంత ఆస్తులను కాపాడుకోవడం కోసం కన్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశాడన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్‌కు అండగా ప్రజలు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.