ఫ్రెండ్లీ ప్రభుత్వానికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తే తప్పేంటి?
ఉపాధ్యాయులను అవమానించేలా మాట్లాడితే సహించం
పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోలంపెల్లి ఆదర్శన్రెడ్డి, ముసు తిరుపతిరెడ్డి
హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్ 1: రిటైర్డ్ ఉపాధ్యాయుడు నరహరి లక్ష్మారెడ్డి పీఆర్టీయూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శినని చెప్పుకొంటూ సంఘం ఇటీవల నిర్వహించిన కృతజ్ఞత సభను కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సబబు అని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోలంపెల్లి ఆదర్శన్రెడ్డి, ముసు తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. ఆయన దిగజారుడు మాటలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. బుధవారం సాయంత్రం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. సంఘంలో 20 సంవత్సరాల పాటు పనిచేసి పదవులు అనుభవించి, స్వప్రయోజనాల కోసం ఓ పార్టీలో చేరి, నైతికంగా దిగజారి మాట్లాడడం సరికాదన్నారు. దీనిని పీఆర్టీయూటీఎస్ జిల్లా శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పదేళ్లకు ఒకసారి పెంచే పీఆర్సీ 15శాతంతో సరిపెడితే, రాష్ట్రంలోని ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లకోసారి పెంచే పీఆర్సీని 30శాతం ప్రకటించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61ఏళ్లకు పెంచడం మీకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు 75ఏళ్లకు రావలసిన క్వాంటం ఆఫ్ పెన్షన్ను 70ఏళ్లకు కుదించడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా ఈ ప్రయోజనాన్ని మీరు పొందడం లేదా? అని నిలదీశారు. మరి అలాంటప్పుడు ఫ్రెండ్లీ విధానంతో ఉన్న ప్రభుత్వానికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తే తప్పేంటి? అని వారు లక్ష్మారెడ్డిని ప్రశ్నించారు. పీఆర్టీయూ సంఘం ప్రభుత్వం ఏదైనా, పాలకులు ఎవరైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉంటుంది తప్ప, ఏనాడూ ఏ సర్కారుకు వ్యతిరేకంగా లేదని స్పష్టం చేశారు. ఆరు నెలలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని అంటున్నారని, అయితే ఒక సంఘ నాయకుడిగా పని చేసిన మీకు పదోన్నతుల ప్రక్రియ కొనసాగక పోవడానికి కారణం ప్రభుత్వమా? లేక ఇతర ఉపాధ్యాయ సంఘాలా? మీకు తెలియదా? అని వారు లక్ష్మారెడ్డిని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎన్నికలకు పీఆర్టీయూటీఎస్ సంఘం నిర్వహించిన కృతజ్ఞత సభకు సంబంధం ఏమిటని, మరోసారి అసందర్భంగా, నిరాధారంగా, ఉపాధ్యాయులను అవమానించేలా మాట్లాడితే సహించేది లేదని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోలంపెల్లి ఆదర్శన్రెడ్డి, ముసు తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు.