ఊరూరా ఘనంగా నిర్వహించేందుకు నాయకుల ఏర్పాట్లు
పార్టీ సంస్థాగత నిర్మాణానికీ నేడే శ్రీకారం
ఈ నెలాఖరులోగా గ్రామ,మండల, పట్టణ, జిల్లా కమిటీలు
సామాజిక సమతూకానికి పెద్దపీట
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 51శాతం ప్రాతినిధ్యం తప్పనిసరి
శ్రేణుల్లో నూతనోత్సాహం
అన్ని నియోజకవర్గాల్లోనూ జోష్
కరీంనగర్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గులాబీ జెండా గుండెల నిండుగా ఎగురబోతున్నది. నేడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగను గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు గురువారం గ్రామగ్రామానా పతాకాలను ఎగురవేసేందుకు శ్రేణులు ఉత్సాహం చూపుతున్నాయి. ఇదే రోజు పార్టీ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుడుతుండగా, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ నెలాఖరులోగా కమిటీలు పూర్తి కానున్నాయి. అందులో అన్ని స్థాయిల కమిటీల్లో సామాజిక సమతూకం తప్పనిసరి అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 51శాతం ప్రాతినిధ్యం ఇవ్వాలని కేటీఆర్ చెప్పడంతో శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 8 లక్షల పై చిలుకు సభ్యత్వాలతో టీఆర్ఎస్ రికార్డు సృష్టించగా, ప్రస్తుతం మరింత పకడ్బందీగా సంస్థాగత నిర్మాణం చేసే దిశగా దండు కదులుతున్నది.
అరవై ఏండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఆది నుంచీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు అండగా నిలుస్తున్నారు. కార్యక్రమం ఏదైనా పార్టీ వెంటే నడుస్తున్నారు. గత ఫిబ్రవరిలో గులాబీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టగా, ఎన్నడూ లేనంతగా మద్దతు తెలిపారు. ఆ కారణంగానే గత చరిత్రలో ఏ పార్టీ నమోదు చేయని స్థాయిలో గులాబీ పార్టీ సభ్యత్వాలతో రికార్డు సృష్టించింది. కేవలం 13 రోజులు సమయమే ఇచ్చి ప్రతి నియోజకవర్గంలోనూ 50వేల సభ్యత్వాలు నమోదు చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఆ లెక్కన ఉమ్మడి జిల్లాలో 6.50 లక్షల సభ్యత్వాల టార్గెట్ ఉండగా, గులాబీదండు ఉత్సాహంగా కదిలింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నియోజకవర్గంలో లక్షకుపై చిలుకు సభ్యత్వాలు చేసి, రికార్డు సృష్టించారు. అలాగే ధర్మపురిలో 80వేల పైచిలుకు చేశారు. మెజార్టీ నియోజకవర్గాల్లో లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8 లక్షల పై చిలుకు సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఏ పార్టీ 2లక్షలకు మించి సభ్యత్వాలు నమోదు చేయలేదు.
పండుగకు రెడీ..
టీఆర్ఎస్ జెండా పండుగను గురువారం (సెప్టెంబర్ 2న) రాష్ట్రంలో మూలమూలలా ఘనం గా నిర్వహించాలని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో పార్టీ జెండా ను ఎగురవేసి కార్యక్రమాలు ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు సూచించిన విషయం విదితమే. అన్ని నియోజకవర్గాల్లోని ప్రజాప్రతిని ధులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ మే రకు కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పార్టీ అగ్రనాయకులు, గులాబీ జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. గడిచిన రెండు మూడు రోజులుగా ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. చాలా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో కొత్తగా జెండా గద్దెలను నిర్మించారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు జిల్లా మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానికంగా ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలను, నాయకులను ఇందుకు సన్నద్ధం చేశారు. అంతేకాదు పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ జెండా పండుగలో పాల్గొనేలా చూడాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. సభ్యులందరికీ ఆయా నియోజకవర్గాల నాయకులు ఆహ్వానాలు పంపించారు.
ఈ నెలాఖరులోగా కమిటీలు..
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టిన టీఆర్ఎస్, ఉమ్మడి జిల్లాలపై మరింత ఎక్కువగా ఫోక్స్ పెట్టింది. ఆది నుంచీ అండగా నిలుస్తున్న ఈ గడ్డపై ఏ కార్యక్రమం ప్రారంభించినా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో కరీంనగర్ అంటే ఒక సెంటిమెంట్‌గా నిలిచిపోయింది. దాంతో ఉమ్మడి జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా చేసే విషయంపై మంత్రులు దృష్టిపెట్టారు. అందులో భాగంగానే 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు.. ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండల, పట్టణ కమిటీల నిర్మాణం చేయనున్నారు. 20 తర్వాత జిల్లా కార్యవర్గాల అధ్యక్షుల ఎంపికను స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నా యకత్వం సమన్వయంతో ప్రకటిస్తారు. అయితే ప్రతి కమిటీలోనూ వివిధ సామాజికవర్గాలకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు కూ డా ఇచ్చింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వేసే ప్రతి కమిటీలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 51 శాతం ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని ఆదేశించడమే కాదు, అలా ప్రాతిని ధ్యం లేని కమిటీలు చెల్లవంటూ స్పష్టం చేసింది. అంటే ప్రతి కమిటీలోనూ అన్నివర్గాలకు భాగస్వామ్యం కల్పించాలన్న లక్ష్యం, ఆశ యం టీఆర్ఎస్లో కనిపిస్తున్నది. ఈ తరహా విధానం, నిబంధనలు ఇప్పటి వరకు ఏ పార్టీ పెట్టినట్లుగా దాఖలాలు లేవు. కమిటీల్లో నిర్ధారిత శాతం లేకుండా కమిటీలు చెల్లవంటూ ఘంటాపథంగా చెప్పిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజకీయ పార్టీల చరిత్రలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని ద్వారా అన్ని సామాజికవర్గాలు ఒకరికి ఒకరు సహకరించుకోవడంతోపాటు సమష్టి సమన్వయంతో పార్టీ బలోపేతానికి మంచి బాటలు వేసినట్లవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.