పాడి’ యూనిట్లకు అధిక ప్రాధాన్యం
కలెక్టర్ ఆర్వీ కర్ణన్
దళితబంధు గ్రౌండింగ్ కమిటీ అధికారులతో సమీక్షా సమావేశం
కరీంనగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలని, పాడి యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు గేదెలు కొనుగోలు చేసి ఇవ్వాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం దళితబంధు గ్రౌండింగ్ కమిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాడి యూనిట్లకు అధిక ప్రాధాన్యమిచ్చి లబ్ధిదారులకు శిక్షణ ఇప్పించాలన్నారు. పాడి యూనిట్లకు హుజూరాబాద్ నియోజకవర్గంలో గ్రామాల వారీగా గేదెల కొనుగోలుకు కరీంనగర్, విజయ డెయిరీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు లబ్ధిదారులను తీసుకువెళ్లి కొనుగోలు చేయాలని సూచించారు. ఒక్కో యూనిట్‌కు రూ.2లక్షల చొప్పున నగదు విడుదల చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. 132 మంది ఎంపిక చేసుకున్న ఇతర లాభసాటి యూనిట్లు సెంట్రింగ్, ఫర్టిలైజర్, మెడికల్ షాప్, మినీ సూపర్ మారెట్లకు సంబంధించి ఎస్బీఐ ఆర్‌సేతి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు. యూనిట్లను నెలకొల్పేందుకు ముందుగా రూ.5లక్షల చొప్పున విడుదల చేయాలని తెలిపారు. లాభసాటి యూ నిట్లను ఎంపిక చేసుకునేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో గ్రౌండింగ్ కమిటీ అధికారులు, ఆత్మ పీడీ ప్రియదర్శిని, లీడ్ బ్యాంక్ ఇన్చార్జి మేనేజర్ జగదీశ్వర్, కరీంనగర్, విజయ డెయిరీ ప్రతినిధులు, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ వెంకటరాంబాబు, పశుసంవర్ధకశాఖ అధికారి జయరామ్, ఆర్ సేతి మేనేజర్ దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.