వారం పాటు స్పెషల్ డ్రైవ్ lఅధికారులకు మంత్రి గంగుల ఆదేశాలు
అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అధ్యక్షతన ఐదు శాఖలతో సమన్వయ కమిటీ తొలగింపునకు ప్రత్యేక బృందాలు
రోడ్డుపై వ్యాపారాల వల్ల 99 శాతం ప్రజలకు ఇబ్బంది
ఆదివారం జరిగిన ఘటనలాంటిది పునరావృతం కాకుండా చర్యలు
అన్ని చోట్లా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం
విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన అమాత్యుడు
కరీంనగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగరంలో రోడ్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కమాన్ వద్ద జరిగిన ఘటనలో నలుగురి మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వద్దని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపునకు వారం రోజులు గడువు ఇచ్చారు. ఇందుకు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధ్యక్షతన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, ఆర్అండ్బీ, విద్యుత్ శాఖలతో కలిపి కమిటీలతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి, విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
కరీంనగర్‌లోని రోడ్లు, పక్కన ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు. అధికారులు తీసుకునే చర్యలపై రాజకీయ జోక్యం ఉండొద్దని కార్పొరేటర్లకు అదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో కరీంనగర్‌లోని ఏ రోడ్డుపైనా ఆక్రమణలు కనిపించొద్దని యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆదివారం కమాన్ వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో ముందుగా అధికారులతో సమావేశమైన ఆయన, తర్వాత కలెక్టరేట్ సమీక్షా సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్లో బాగు పడిన రోడ్లు, తద్వారా ఏర్పడిన సౌకర్యాలు, వాటి దుర్వినియోగం, ఆక్రమణలు, ఫుట్‌పాత్‌లపై జరుగుతున్న వ్యాపారాలు, తద్వారా వస్తున్న ఇబ్బందులు వివరించారు. వారం పాటు చేపట్టనున్న స్పెషల్‌డ్రైవ్, ఇందులో అధికారులు తీసుకునే చర్యలను మంత్రి వెల్లడించారు.
దుర్ఘటన బాధాకరం
ఆదివారం కమాన్ ప్రాంతంలో కారు అతివేగం వల్ల నలుగురు మృతి చెందడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందన్న మంత్రి.. సదరు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున సానూభూతిని ప్రకటించారు. ఈ ఘటనలో ప్రభుత్వం, అధికారుల పొరపాటు ఏమాత్రమూ లేదని స్పష్టం చేశారు. మృతుల దహన సంస్కారాలు, ఇతర అవసరాలకు సదరు కుటుంబాలకు నగదు సాయం చేసినట్లు తెలిపిన మంత్రి.. క్షత్రగాత్రులకు పూర్తి స్థాయిలోప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందించేందుకు ప్రతిమ దవాఖానకు తరలించినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించేందుకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇవేకాకుండా.. సదరు కుటుంబాలను అన్ని రకాలా ఆదుకుంటామని చెప్పిన మంత్రి.. సదరు సీసకమ్మర సామాజిక వర్గం వారికి గతంలోనే రోడ్డుపై పనులు చేయవద్దంటూ పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. షెడ్లు అక్కడి నుంచి తొలగించామని, ప్రత్యామ్నాయం చూపించాలని వారి సంఘాలు అడిగితే.. ఆ మేరకు కరీంనగర్ బస్‌స్టేషన్ వెనుకాల స్థలం చూపించామని తెలిపారు. వారు అక్కడికి వెళ్లి ఉంటే.. ఆదివారం ఘటనలో ప్రాణాలు పోయి ఉండేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదన్నారు. ఈ ఘటన విషయంలోనూ కొన్ని పార్టీలు రాజకీయం చేసే ప్రయత్నం చేశాయని మండిపడ్డారు. ధర్నాలు చేసిన ఏపార్టీ నాయకుడు బాధిత కుటుంబానికి ఒక్క పైసా సాయం చేయలేదని, కానీ.. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి తప్పు లేకపోయినా అన్ని రకాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆక్రమణల తొలగింపునకు వారం డెడ్‌లైన్
నగరంలో 14.5 కిలోమీటర్ల పొడవున ప్రధాన రహదారులు అధునాతనంగా మారాయని, వీటితో పాటు గడియారం, తదితర ప్రాంతాల్లో స్మార్ట్‌సిటీ, సీఎం అస్యూరెన్స్ కింద పెద్దఎత్తున రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. కొందరు సదరు రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని వ్యాపారాలు, వారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, ఇలాంటి వాటి వల్ల ప్రమాదాలు జరిగినప్పడు.. ప్రాణాలుపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అంతే కాదు.. రోడ్లపై ఆక్రమణలు, వ్యాపారాలు చేయడం వల్ల పార్కింగ్ సమస్యతో పాటు.. ప్రజల రాకపోకలకు ఇబ్బందులెదురవుతున్నాయని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని.. ఏ రోడ్డుపైనా ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధ్యక్షతన ఐదు శాఖలతో కమిటీ వేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఆక్రమణల తొలగింపు కోసం స్పెషల్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసు కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కొందరు చేస్తున్న వ్యాపారాలు, ఆక్రమణల వల్ల 99 శాతం ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. అందుకే వారం రోజుల్లో అన్ని ప్రాంతాల్లో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాలని ఆదేశించినట్లు తెలిపారు. వ్యాపారులు, ఆక్రమణదారులు, ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే రోడ్లు, ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేస్తున్న వారికి అన్ని చోట్లా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రజల ప్రాణాలే ముఖ్యం
ఆస్తులు పోతే ఫరవాలేదు కానీ.. ఏకంగా ప్రాణాలు పోతే కుటుంబాలకు ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరని చెప్పిన మంత్రి.. ఆక్రమణల తొలగింపు చేపట్టకపోతే.. ఆదివారం వంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలుంటాయన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ట్రాఫిక్లైట్ల ఆధునీకరణకు సంబంధించి టెండర్లు పిలిచినట్లు మేయర్ సునీల్‌రావు వెల్లడించారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆక్రమణల తొలగింపు విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి ఆదేశాల ప్రకారం వారం రోజుల్లో ఆక్రమణలన్నింటినీ తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అలాగే, నగరంలో అత్యంత వేగంగా వెళ్లే వాహనాలతో పాటు మైనర్లు నడుపుతున్న వాహనాలపై ప్రత్యేక దృష్టిపెడుతామన్నారు. ఇందుకోసం ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. దీంతోపాటు గడియారం, శాస్త్రిరోడ్డు, శనివారం కూరగాయల మార్కెట్ వంటి ప్రాంతాల్లో దుకాణాదారులు రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని, వాటిని తొలగించడమే కాకుండా సదరు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మేయర్ సునీల్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.